దిశ దశ, కరీంనగర్:
పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి పోటీ తీవ్రంగా ఉంది. ఈ సారి ఎలాగైనా బరిలో నిలిచి మండలిలోకి అడుగు పెట్టాలని అటు వివిధ పార్టీల నాయకులు, ఇటు విద్యా సంస్థల యజమానులు రంగంలోకి దిగుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటానని సన్నిహితులతో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వివిధ వర్గాలకు చెందిన వారు పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
ట్రస్మా సపోర్ట్…
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ట్రస్మా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి, ప్రస్తుత ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న యాదగిరి శేఖర్ రావు బరిలో నిలిచేందుకు సమాయత్తం అయ్యారని ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ట్రస్మా ఆయనకు అండగా నిలబగాలని నిర్ణయించడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అంతా కూడా యాదిగిరి శేఖర్ రావు గెలుపులో తమవంతు బాధ్యతలను మోయాల్సిన అవసరం ఉందని అనుకున్నట్టుగా తెలిసింది. గతంలో కూడా యాదగిరి శేఖర్ రావు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తిని కనబర్చినప్పటికీ అభ్యర్థిత్వం ఖరారు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరో అభ్యర్థికి అవకాశం కల్పించడంతో శేఖర్ రావుకు నిరాశే ఎదురయింది. అయితే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం యాదగిరి శేఖర్ ఖచ్చితంగా పోటీ చేయాలని ట్రస్మా ప్రతినిధులు ప్రతిపాదిస్తుండడంతో ఆయనకు కొంతమేర లాభించే అవకాశం కనిపిస్తోంది. వివిధ పార్టీల నుండి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య తీవ్రంగా ఉండడంతో స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయాలని ట్రస్మా సమావేశంలో కొంతమంది ప్రతిపాదించినట్టుగా సమాచారం. దీంతో యాదిగిరి శేఖర్ రావు పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
శాసించే అవకాశం…
అయితే తాజాగా ట్రస్మా శేఖర్ రావుకు వెన్నుదన్నుగా నిలబడాలని నిర్ణయించడం వల్ల అభ్యర్థుల తలరాతలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గమైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సుమారు 2500 నుండి 3వేల వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ గ్రాడ్యూయేట్లు సుమారు లక్ష మంది వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని ట్రస్మా అంచనా వేస్తోంది. వీరితో పాటు విద్యార్థుల పేరెంట్స్ ను తమకు అనుకూలంగా మల్చుకోవడం, వారి వ్యక్తిగత పరిచయాలను కూడా శేఖర్ రావు గెలుపునకు ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నారు. మరో వైపున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని ప్రాంతాలకు చెందిన మిగతా పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు కూడా కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి ప్రైవేటు పాఠశాలల ప్రతినిధిని మండలికి పంపించాలన్న కృత నిశ్చయంతో ఉన్న ట్రస్మా ప్రతినిధులు విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.