రంగంలోకి దిగనున్న సీబీఐ..?
దిశ దశ, పెద్దపల్లి:
రాష్ట్రంలో సంచలనం కల్గించిన జంట హత్యల కేసు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మంథని మండలం గుంజపడుగకు చెందిన గట్టు వామన్ రావు, నాగమణిలు మంథని కోర్టుకు హాజరై వెలుతున్న క్రమంలో రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసు విషయంలో పోలీసులు విచారణ జరిపి పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వామన్ రావు, నాగమణిల హత్య కేసులో విచారణ పారదర్శకంగా జరగలేదని, అసలు నిందితులను తప్పించారంటూ ఆయన తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని అభ్యర్థించడంతో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసుతో పుట్ట మధుకు సంబంధం ఉందని, గట్టు వామన్ రావు మరణ వాంగ్మూలంలో ఆయన పేరు చెప్పారని కిషన్ రావు తరుపు న్యాయవాది వాదించగా… పుట్ట మధుకు ఏ మాత్రం సంబంధం లేదని, కక్షపూరితంగా అతని పేరు ఇరికించారని అతని తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.
సీబీఐ విచారణకు ఓకే…
మరో వైపున ఈ కేసును విచారించేందుకు CBIకి అప్పగించాలన్న అభ్యర్థనపై తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించగా, కోర్టు ఆదేశిస్తే విచారించేందుకు సిద్దంగా ఉన్నామని సీబీఐ తరుపు న్యాయవాది వెల్లడించారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డిఫెన్స్ వారిని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే జాతీయ దర్యాప్తు సంస్థచే వామన్ రావు, నాగమణిల హత్య కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉండగా సీబీఐ కూడా సంసిద్దత వ్యక్తం చేయడంతో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠత నెలకొంది. డిఫెన్స్ వారు ఇచ్చే కౌంటర్ కూడా ఇందుకు కీలకం కానుందని సమాచారం. ఒక వేళ సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రం అడ్వకేట్స్ మర్డర్ కేసును విభిన్న కోణాల్లో ఆరా తీసే అవకాశాలు ఉంటాయి.