ఆందోళన నిర్వహించిన గొత్తి కోయలు…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీని అక్కున చేర్చుకున్న మూలవాసీలే వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టులతో మమేకమే సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసీ తెగలకు సంబంధించిన వారే తెలంగాణలో నిరసన వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా పెనుగోలు కాలనీకి చెందిన పంచాయితీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్ లు పోలీస్ ఇన్ పార్మర్లుగా ఆరోపిస్తూ మావోయిస్టులు గొడ్డళ్లతో నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తీరుపై సరిహధ్దు గ్రామాల ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా ముద్ర వేసి చంపేయడం ఎంత వరకు సమంజసం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో నిరసన ర్యాలీ చేపట్టిన ఆదివాసీలు పోలీసుల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరిని మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల పేరిట హత్య చేయడం వల్ల తమపై నిందలు పడ్డామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య తాము సమిధలుగా మారిపోతున్నామన్న ఆందోళన స్థానిక ఆదివాసీల్లో వ్యక్తం అవుతోంది. అయితే మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఆదివాసీలను హత్య చేయడం మాత్రం సరైన చర్య కాదని ఆదివాసీ సమాజం కుండబద్దలు కొట్టి మరీ వాదిస్తోంది. అమాయకులపై ఆరోపణలు చేయడం సరైంది కాదని వాదిస్తోంది. రెండు కుటుంబాలు కూడా పెద్దదిక్కును కోల్పోయాని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గొత్తి కోయలు సైతం…
మరోవైపున ఏటూరునాగరంలో గొత్తికోయలు కూడా రోడ్డెక్కారు. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల పేరిట ఇద్దరిని చంపివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సల్వా జుడం ఏర్పాటు తరువాత దండకారణ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను గమనించి వందలాది గొత్తి కోయ కుటుంబాలు సరిహద్దు ప్రాంతాలకు వచ్చాయి. సరిహద్దు జిల్లాల్లోని అడవుల్లో అవాసాలు ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లుగా తెలంగాణాలో నివాసం ఉంటున్నారు. అయితే వీరు చత్తీస్ గడ్ కు చెందిన మావోయిస్టు నాయకత్వంతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో పోలీసులు పలుమార్లు సోదాలు నిర్వహించిన సందర్భాలూ లేకపోలేదు. మరో వైపున వారిని సరిహద్దు అడవులు ఖాలీ చేసి వెళ్లిపోవాలని కూడా సూచించారు. సరిహధ్దు అడవుల్లో మకాం వేసుకున్న గొత్తి కోయల విషయంలో కఠినంగా వ్యవహరంచాలని కూడా పోలీసు ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేశారు. నక్సల్స్ సానుభూతిపరులుగా ముద్రపడ్డ గొత్తి కోయలు కూడా రోడ్లపైకి వచ్చి మావోయిస్టుల దుశ్యర్యకు పాల్పడ్డారని ఆరోపణలకు దిగడం గమనార్హం.
బాధిత కుటుంబాలతో…
తాజాగా సరిహధ్దు జిల్లాల్లో మావోయిస్టులు కోవర్టులను, ఇన్ ఫార్మర్లను చంపి సరిహధ్దుల్లో వేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు బాధిత కుటుంబాలను అక్కున చేర్చుకుంటున్నారు. పార్టీలో ఉన్న బంటి రాధ అలియాస్ నీల్సోను హత్య చేసిన మావోయిస్టులు భద్రాద్రి జిల్లాలో వేసి ఆమె కోవర్టుగా మారిపోయినందున చంపివేశామని ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, దళితులు, గిరిజనులు కూడా పార్టీ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఆ తరువాత పార్టీ నీల్సోను విచారించిన ఆడియోలను, విచారణకు సంబంధించిన నివేదికను విడుదల చేయాల్సి వచ్చింది. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన అన్నదమ్ములను హత్య చేసిన నేపథ్యంలో పోలీసులు బాధిత కుటుంబాన్ని పరమార్శించారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ రమేష్, అర్జున్ ఇండ్లకు వెల్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించారు. వారికి బాసటగా ఉంటామని, పిల్లల చదువుల కోసం కూడా అండగా నిలుస్తామన్నారు.