భద్రాద్రి వద్ద ఉగ్ర గోదావరి: మూడో ప్రమాద హెచ్చరిక జారీ

బందు అనిత 

దిశ దశ, భద్రాచలం:

భద్రాద్రి రాములోరి సన్నిధిలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. తగ్గినట్టే తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అధికారులు. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 53.20 ఫీట్ల అడుగుకు నీరు చేరింది. మూడు రోజుల క్రితం రెండో ప్రమాద హెచ్చిరక తరువాత నీటిమట్టం తగ్గడంతో గోదావరి శాంతించిందని సంతోషం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే తిరిగి పుంజుకుంది. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు 53 ఫీట్లకు నీటిమట్టం చేరుకోగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోని కొత్తకాలనీ, అశోక్ నగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీల్లోకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. కొత్తకాలనీకి వచ్చి చేరిన నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఐదు మోటార్లను ఏర్పాటు చేసి గోదావరిలోని నీటిని మళ్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో రెండు మోటార్లు మొరాయించడం వల్లే నీరు కొత్తకాలనీకి వచ్చి చేరిందని తెలుస్తోంది. అయితే గోదావరి నదిలో నీటి ప్రవాహం తీవ్రత వల్ల పాల్వంచ రహదారి మినహా మిగతా దారులన్ని కూడా జలమయం కావడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, వీఆర్ పురం, కుక్కునూరు రహదారులన్ని జలదిగ్భంధనంలో చిక్కుకపోయాయి.

మంత్రి పర్యవేక్షణ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  భద్రాచలంలోనే ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అదికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హుటాహుటిన చర్యలకు ఉపక్రమించే విధంగా యంత్రాంగాన్ని పురమాయిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ గిరిష్ లు కూడా భద్రాచలంలోనే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తెల్లవారే సరికి తగ్గే అవకాశం..? 

చత్తీస్ గడ్ నుండి వచ్చే చేరే శబరి, ఇంద్రావతి నదుల్లో వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్టయింది. మూడు రోజుల క్రితం వరకు శబరితో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనూహ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలిసే ప్రాణహితలో వరద నీటి తీవ్రత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 9,89,600 క్యూసెక్కుల వరద నీరు మేడిగడ్డ బ్యారేజీ నుండి దిగువ ప్రాంతానికి చేరుకుంది. శబరితో పాటు ఇతరాత్ర నదుల్లో వరద తక్కువ స్థాయిలో వస్తుండడంతో పాటు  భద్రా చలం వద్ద క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఇతరాత్ర వాగులు, వంకల నుండి వచ్చిన వరద భద్రాచలం వద్దకు చేరుకునే సేరికి 14,26,684 క్యూసెక్కులకు చేరుకుంది. అయితే శనివారం సాయంత్రం 6 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ నుండి 5,39,200 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ వరద తాకిడి ఇలాగే తగ్గినట్టయితే ఆదివారం భద్రాద్రి వద్ద నీటిమట్టం తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

You cannot copy content of this page