దిశ దశ, భూపాలపల్లి:
త్రివేణి సంగమం అనగానే దేశ వీదేశీయులంతా కూడా ప్రయాగరాజ్ వైపు చూస్తుంటారు. వారణాసి సమీపంలో ఉన్న ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా నదులు ప్రవహిస్తాయి. రెండు నదులు కలిసిన చోట సరస్వతి అంతర్వాహిని కూడా ప్రవహిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పూర్వకాలంలో సరస్వతి నది కూడా ఉండేదని అది కాలగర్భంలో కలసిపోయిందని చరిత్ర చెప్తోంది. మూడు నదులు కలిసిన ప్రాంతంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత ప్రాశస్త్యం పొందిన నగరం ప్రయాగరాజ్ మాత్రమే. ఇక్కడ కుంభమేళ నిర్వహించే ఆనవాయితీ కూడా ఉండడం కూడా అందరి దృష్టి అటువైపే పడుతోంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ అత్యంత అరుదైన చరిత్రను తనలో దాచుకుంది.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం
భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు వద్ద ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం
మూడు చోట్ల…
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం కాళేశ్వరానికి మాత్రమే ప్రయగారాజ్ తరువాత త్రివేణి సంగమంగా గుర్తింపు ఉంది. ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులు కలుస్తున్నందున సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని త్రివేణి సంగమంగా పిలుస్తుంటారు. కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి కావడం, ఒకే పానవట్టంపై యముడు, శివుడు వెలిశాయి. అయితే కాళేశ్వరానికి దిగువన కూడా మరో త్రివేణి సంగమం ఉన్నప్పటికీ ప్రాచూర్యంలోకి మాత్రం రాకుండా పోయింది. పలిమెల మండలం దమ్మూరు వద్ద మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహధ్దుల మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నది గోదావరి నదిలో కలుస్తోంది. మహారాష్ట్రలోని ఆసరెల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని అక్కడి వారు, తెలంగాణాలోని పలిమెల ప్రాంత వాసులు సంఘం అని పిలుస్తుంటారు. కానీ త్రివేణి సంఘమ ప్రాంతంగా మాత్రం అంతగా గుర్తింపు పొందలేదనే చెప్పాలి. భద్రాద్రి జిల్లా రేఖపల్లి, కూనవరం, సమీపంలో శబరి నది గోదావరి నదిలో కలుస్తున్నది. రెండు నదులు సంఘమించిన చోట సరస్వతి అంతర్వాహిని నది కూడా కలిసే అవకాశం ఉన్నదని చరిత్రకారులు చెప్తున్నందున ఈ రెండు ప్రాంతాలు కూడా త్రివేణి సంగమాలుగానే భావించాలి. వచ్చే మే నెలలో సరస్వతి అంతర్వాహినికి పుష్కరాలు జరుపుతున్న నేపథ్యంలో కాళేశ్వరంతో పాటు పలిమెల మండలంలోని దమ్మూరు, భద్రాద్రి జిల్లాలోని రేఖపల్లి, కూనవరం ప్రాంతాల గురించి కూడా ప్రచారం చేసినట్టయితే ఆయా ప్రాంతాల్లోనూ భక్తులు పుణ్న స్నానాలు చేసే అవకాశం ఉంటుంది. త్రివేణి సంఘమాలు మూడు చోట్ల ఉన్నాయన్న విషయం గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మూడు ప్రాంతాలను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చినట్టయితే ఆయా ప్రాంతాల్లో టూరిస్టుల రాకపోకలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.
ప్రయాగరాజ్ తరహాలో…
కేవలం ఒకే ఒక్క చోట త్రివేణి సంగమం ఉన్న ప్రయాగరాజ్ విషయంలో అక్కడి ప్రభుత్వం వెచ్చించిన నిధులు, ఏర్పాట్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. కుంభమేళ స్థాయిలో కాకున్నప్పటికీ భారీ ఏర్పాట్లు చేస్తూ విస్తృత ప్రచారం చేసినట్టయితే భక్తులు, పర్యాటకులు త్రివేణి సంఘమ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. రేఖపల్లి, కూనవరంతో భద్రాద్రి రామాలయం, దమ్మూరుతో అంబట్ పల్లి గ్రామంలోని అమరేశ్వరాలయం, బ్రిటీష్ కాలంలో నిర్మించ తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి కూడా ప్రచారం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే టూరిస్టుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. భద్రాద్రి సమీపంలోని రేఖపల్లి, కూనవరం వద్ద శబరి కలిసే చోటు గురించి వెలుగులోకి తీసుకొచ్చినట్టయితే కోస్తాంధ్రా, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ఒడిషా రాష్ట్రాలకు చెందిన వారి రాకపోకలకు సులువు అవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇతరాత్ర చారిత్రాత్మక ప్రాంతాలను కూడా వెలుగులోకి తీసుకవచ్చే ప్రయత్నం చేస్తే కేవలం ఉత్సవాలు జరిపే సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పర్యాటకుల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ నుండి ఆయా ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేసి వెల్లేప్పుడు సందర్శించాల్సిన ప్రాంతాలను, తిరుగు ప్రయాణంలో రూట్ మార్చి వచ్చినట్టయితే ఆ ప్రాంతంలో ఉండే సందర్శణీయ స్థలాల గురించి వివరిస్తూ అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉండకపోగా, ఆయా ప్రాంతాల ప్రాశస్త్యం గురించి ప్రచారం చేసినట్టు అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెల్లిన భక్తుల వాహనాలతో నేషనల్ హైవేలే ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలంగాణాలోని త్రివేణి సంఘమ ప్రాంతాల్లో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు చేసినట్టయితే అన్ని విధాలుగా బావుంటుందని అంటున్నారు.
భద్రాద్రి జిల్లా రేఖపల్లి, కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్న శబరి నది