సింహం… ఏనుగు…

కలవరపెడుతున్న గుర్తులు

అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన…

దిశ దశ, హైదరాబాద్:

ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో అభ్యర్థులు గెలుపోటములపై దృష్టి సారించడం కామన్. ప్రత్యర్థుల బలహీనతలను ఆలంబనగా చేసుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తల మునకలవడమూ సహజమే. కానీ కొన్ని శాసన సభ నియోజకవర్గాల అభ్యర్థుల మదిని తొలుస్తోందో విషయం. తాము పెంచి పోషించిన గుర్తులు తమ పతనాన్ని శాసిస్తాయన్న భయం వారిని వెంటాడుతోంది. గత ఎన్నికల్లో తమ తలరాతలను మార్చిన ఆ గుర్తులు ఇప్పుడు కదనరంగంలో దూకేందుకు సిద్దం కావడమే వారిని కలవరపెడుతోంది. అయితే పబ్లిక్ బాగా ఫిక్సయిపోయిన ఆ గుర్తులపై తాము పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు ఆశావాహులు. దీంతో తెలంగాణాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ రెండు గుర్తులు క్రేజీ సంపాదించుకున్నాయనే చెప్పాలి.

రాష్ట్రంలోని గతగ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల సింబల్ విస్తృతంగా ప్రచారం కావడమే ఇందుకు కారణమని చెప్పాలి. తెలంగాణ ఆవిర్బావం తరువాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీల గుర్తులు కొంతమంది అభ్యర్థులకు బాసటనిచ్చాయి. మరి కొంతమందిని రెండో స్థానంలో నిలబెట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటిన పార్టీలు కావడంతో ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల సింబల్స్ కు కొంత డిమాండ్ పెరిగే అవకాశమే కనిపిస్తోంది. దీంతో ఆయా పార్టీల నాయకులను మచ్చిక చేసుకునే పనిలో ఆశావాహులు నిమగ్నం కాగా… గత ఎన్నికల్లో వాటితో బరిలో నిలిచిన అభ్యర్థులు సింబల్స్ ను తెరమరుగు చేయడం ఎలా అన్న ఆలోచనలో పడిపోయారన్న చర్చ సాగుతోంది.

బీఎస్పీ ఇలా…

2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గజం ధ్వజమెత్తింది. నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పుర్ లో కోనేరు కోనప్పలు బీఎస్పీ అభ్యర్థులగా నిలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత వీరిద్దరూ కూడా నీలం జెండా వదిలేసి గులాభి కండువా కప్పుకున్నారు. దీంతో తొలిసారి బీఎస్పీకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిథ్యం లభించినప్పటికీ గెలిచిన ఇద్దరు కూడా గులాభి జెండా పంచన చేరడంతో బీఎస్పీ ఉనికిని కోల్పోయినట్టయింది. అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ లో కూడా బెర్త్ కనఫం చేసుకున్న ఆయన 2018 ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థిగానే బరిలో నిలిచి గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ ప్రాభవాన్ని చాటుకోలేకపోయింది అయితే ఈ సారి ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్న ఆయన తన బాధ్యతలకు రాజీనామా చేసి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆర్ఎస్పీ ఏర్పాటు చేసిన స్వైరోస్ చాలా బలమైన ఆర్గనైజేషన్ గా ఎదగగా, గురుకుల పాఠశాలల్లో తీసుకున్న సంస్కరణలు, కఠిన నిర్ణయాలతో సత్ఫలితాలు సాధించారు. ఈ కారణంగా పేరెంట్స్ తో పాటు స్టూడెంట్స్ లో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారన్నది వాస్తవం. అప్పడు తయారు చేసుకున్న ఇమేజ్ కూడా బీఎస్సీకి లాభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సింహం గుర్తు ఇలా…

గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తన ఉనికిని చాటుకుంది. 2014 ఎన్నికల్లో కూడా సింహం గుర్తుపై ఒక స్థానంలో నిలబడగా 1100 ఓట్లతో సింహం గుర్తు అభ్యర్థి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో 11 స్థానాల్లో నామినేషన్లు వేయగా ఐదు చోట్ల అభ్యర్థులు బలమైన పోటీ ఇచ్చినా ఒక్కరు మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టగా మరో చోట రెండో స్థానంలో ఏఐఎఫ్ బి అభ్యర్థి నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగుండం, కరీంనగర్, కొల్లాపూర్, ఐజాతో పాటు పలు చోట్ల సింహం గుర్తుపై అభ్యర్థులు గెలిచారు. ప్రధానంగా కొల్లాపూర్, ఐజాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న వారూ లేకపోలేదు. కరీంనగర్ లో కూడా 10మందిలో ముగ్గురు కార్పోరేటర్లు గెలవగా నలుగురు రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 12 వేల ఓట్లు సాధించగా, రామగుండంలో 40 మంది బరిలో నిలిస్తే 9 మంది గెలచారు. వీరిలో ఐదుగురు అభ్యర్థులు వంద లోపు ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. నకిరేకల్ 14 స్థానాల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు పోటీ చేయగా ఆరుగురు గెలిచి సత్తా చాటుకోగా, వరంగల్ లో ఒక కార్పోరేటర్ గెలిచారు. ఇవే కాకుండా జడ్పీటీసీ, మండల పరిషత్ స్థానాల్లో కూడా సింహం సింగిల్ గా బరిలో నిలిచింది.

వారికి బెరుకు… వీరికి చెరుకు…

అయితే గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తరుపున పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి ఇతర పార్టీల్లో చేరడంతో తాము పెంచిపోషించిన గుర్తులు తమను ఇరుకున పెడ్తాయా అన్న వేదన అభ్యర్థులను వెంటాడుతోంది. తమ సెగ్మెంట్లలో బలమైన పునాది వేసిన రెండు పార్టీ గుర్తులపై పోటీ చేసేందుకు వేరే అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారా అన్న భయం కూడా కొంతమందిలో కనిపిస్తోంది. ఇప్పుడు వేరే పార్టీల నుండి పోటీ చేయాలని కలలు కంటున్న రెండు పార్టీల పూర్వ అభ్యర్థులు ఇప్పుడు తామున్న పార్టీల్ బెర్త్ కనఫం చేసుకోవడంతో పాటు ఆ పార్టీ గుర్తుపై ఎవరూ నిలబడకుండా ఉండాలని ఆశిస్తున్నారు. లేనట్టయితే తమపై తామ వల్ల వేళ్లూనుకున్న గుర్తులపై పోటీ చేసే ప్రత్యర్థులు తమకు తీరని నష్టాన్ని కల్గిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే ఆశావాహులు ఇప్పటికే తమ టికెట్ ఖాయం చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. తీవ్రమైన ప్రభావం చూపనున్న ఏనుగు, సింహం గుర్తులపై పోటీ చేస్తే తాము ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఆశావాహులు ఉన్నట్టు సమాచారం. దీంతో తామా ఆ పార్టీల బీఫారాలు తెచ్చుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్సీ సిర్పూర్ లో పర్యటించినప్పుడు తాను ఇక్కడి నుండే పోటీ చేస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీ నుండి ఇక్కడి నుండి గెలిచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రకటన చేసినట్టుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల గణాంకాలను గమనించి ఇతర నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసే అభ్యర్థులు ఆసక్తి చూపే అవకాశాలు లేకపోలేదు. మరో వైపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ చీఫ్ బండ సురేందర్ రెడ్డితో కూడా ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే టచ్ లో ఉంటున్నారని సమాచారం. తమకు వచ్చే ఎన్నికల్లో బీఫారం ఇవ్వాలని ఆయన్ని అభ్యర్థిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో వైపు గతంలో సింహం గుర్తుపై పోటీ చేసిన వారు కూడా సింబల్ చేజారి పోకుండా ఉండేందుకు సురేందర్ రెడ్డిని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఆసక్తి కలిగిన బలమైన నాయకులకు అవకాశం ఇస్తేనే బావుంటుందని నిర్ణయించడం గమనార్హం. ఏదీ ఏమైనా ఆపత్కాలంలో ఆదుకున్న పార్టీలే తమను పుట్టి ముంచుతాయా అన్న భయం పాత అభ్యర్థుల్లో నెలకొంటే… ఆ బలాన్ని అంది పుచ్చుకుని తమ భవిష్యత్తును పరీక్షించుకుందామని కొత్త వారు ఆలోచిస్తుండడం విశేషం.

You cannot copy content of this page