దిశ దశ, రామగుండం:
కుంభ మేళాలో పుణ్య స్నానం చేసేందుకు బయలుదేరిన వారికి రైల్వే శాఖ పరీక్ష పెడుతోంది. ప్రయాగ రాజ్ వెళ్లి పితృకర్మలు చేసుకోవాలనుకున్న వారి సహనానికి సవాల్ విసురుతున్నట్టుగా ఉంది. తెలంగాణా మీదుగా ఉత్తర భారతదేశానికి వెల్లేందుకు రైలు మార్గం సుగమంగా ఉంటుందని అనుకున్న చాలా మంది పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని స్టేషన్ల మీదుగా ప్రయాగ రాజ్ వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రయాగరాజ్ వెల్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు వేశామని రైల్వే శాఖ ప్రకటించినప్పటికీ సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. జనవరి 26వ తేది 12.15 నిమిషాలకు రామగుండం రావల్సిన ప్రత్యేక రైలు ఈ రోజు 7.30 గంటల వరకూ చేరలేదు. అర్థరాత్రి చలిలో స్టేషన్ కు వచ్చి ట్రైన్ కోసం ఎదరు చూస్తున్న ప్రయాణీకుల ప్రత్యక్ష్య నరకం అనుభవించారు. సికింద్రాబాద్ నుండి 07647 నంబర్ ట్రైన్ ను ప్రత్యేకంగా నడిపిస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో భక్తులు ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని తీరా స్టేషన్ కు చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలో సికింద్రాబాద్ నుండి రామగుండం చేరవల్సిన ట్రైన్ ఆదివారం ఉదయం వరకూ రాకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుండి…
అయితే తెలంగాణ సరిహద్దు ప్రాంతం కూడా కావడంతో మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని బస్తర్ పూర్వ జిల్లాలకు చెందిన సమీప ప్రాంత వాసులు ఈ ప్రాంతం మీదుగా వెల్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇందు కోసం బోర్డింగ్ స్టేషన్ నుండి టికెట్లు బుక్ చేసుకుని వందల కిలో మీటర్ల దూరం నుండి సమయానికి రామగుండం స్టేషన్ కు చేరుకున్నారు. అర్థరాత్రి 12.15 గంటలకు రావల్సిన ట్రైన్ తెల్లవారి 7.30 గంటల వరకు కూడా రాకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్రైన్ చేరడానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంపై కూడా రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణీకులు స్టేషన్ లోనే పడిగాపులు పడాల్సి వచ్చింది.
సౌకర్యాలు లేక…
రామగుండం స్టేషన్ లో కనీసం సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి సమయం కావడంతో ట్రైన్ వచ్చే సరికి వెయిటింగ్ చేసేందుకు కూడా రూం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ప్రయాణీకులు వివరించారు. వాష్ రూమ్స్ ఫెసిలిటీ కూడా లేకపోవడంతో అవస్థలు ఎదురయ్యాయని వాపోయారు. స్పెషల్ ట్రైన్ పై ఆధారపడి మహిళలను కూడా తీసుకెళ్లినట్టయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రయాగరాజ్ చేరడానికే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయని, రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైన్ల ఆలస్యం ఎంత సేపు ఉంది అన్న వివరాలను వెల్లడించే విషయంలో అయినా స్పష్టత ఉంటే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.