పాలకమండలి సభ్యులను అరెస్ట్ చేయాలి
బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీని రద్దు చేయడంతో పాటు పాలకమండలి సభ్యులను, మంత్రి కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మద్యాహ్నం అసెంబ్లీ ముందు గన్ పార్క్ వద్ద పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మండి పడ్డారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా అన్ని రంగాల్లోనూ స్కాంలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వారి కోసం పేపర్లు లీకేజ్ చేసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ధరణితో పాటు పేపర్ లీకేజీలతో కేసీఆర్ కుటుంబం హస్తం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసిన క్యాబినెట్ మంత్రులు కవిత కోసం ఢిల్లీకి వెల్లారంటూ బీఎస్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణం కేటీఆర్ నిర్లక్ష్యమేనని ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ పాపం చేయని ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారని, టీఎస్ పీఎస్ సీ పేపర్ల లీకేజీకి బాధ్యుడైన కేటీఆర్ ను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ శ్రేణులు TSPSC కార్యాలయం ముట్టడికి బయలుదేరాయి.