ఆంతర్యం ఏంటో..?
మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు కలిసి సమీకరణలు చేస్తుండడం సహజంగా మారిపోయింది. మీడియా సంస్థల అందించే వార్తా కథనాల ద్వారా ప్రజలు ఓ నిర్ణయానికి వస్తారన్న అభిప్రాయంతో పొలిటికల్ పార్టీల ముఖ్య నాయకులు ఉంటారు. ఇప్పటి వరకు ప్రముఖ దిన పత్రికలు, ఛానెల్స్ యజమానులతో మాత్రమే కొన్ని పార్టీల నాయకులు చర్చలు జరపడం సహజం. గతంలో అయితే సంపాదకులతో రాష్ట్ర స్థాయి నాయకులు తరుచూ సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎడిటర్స్ అందించిన ఫీడ్ బ్యాక్ తో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేవారు. కానీ గత కొంతకాలంగా సంస్థల యజమానులతో సమావేశాలయ్యే సంస్కృతి ప్రారంభం అయింది. తాజాగా టీవీ5 ఛైరన్మ్ బీఆర్ నాయుడు టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ తో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీవీ5 ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ దూకుడూగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఈ సంస్థ ఛైర్మన్, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్గతంగా జరిగిన చర్చల గురించి బయటకు పొక్కనప్పటికీ వీరిద్దరు ఇప్పుడు భేటీ కావడం ఏంటన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత ఎక్కువ వార్త కథనాలను ప్రసారం చేయాలన్న విషయంపై చర్చించారా లేక, వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రప్పించేందుకు అవసరమైన వ్యూహంతో ముందుకు సాగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారో తెలియడం లేదు. కానీ వీరిద్దరు భేటీ కావడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.
Disha Dasha
1884 posts