బాధితులను తరలించనున్న ఆర్మీ ఆఫీసర్స్
దిశ దశ, భూపాలపల్లి:
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి ఆర్మీ హెలిక్యాప్టర్లు రెండు కొద్ది సేపటి క్రితం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 9 గంటలుగా వరద నీటిలో చిక్కుకున్న మోరంచపల్లి వాసులను రక్షించేందుకు ఆర్మీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. మోరంచపల్లి ప్రాంతాన్ని ఏరియల్ ద్యార పర్యవేక్షించిన అనంతరం గ్రామస్థులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారి సమీపంలోకి హెలిక్యాప్టర్ చేరుకోనుంది. రోప్ సాయంతో హెలిక్యాప్టర్ నుండి కిందకు దిగి ఆర్మీ అధికారులు బాధితులను హెలిక్యాప్టర్ లోకి పంపిస్తారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కూడా సేఫ్ గా తరలించేందుకు రెండు హెలిక్యాప్టర్లు కూడా నిరంతరంగా పని చేయనున్నాయి. గ్రామంలో మొత్తం 1200 నుండి 1500 వరకు ప్రజలు ఉన్నారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆర్మీ హెలిక్యాప్టర్ ఆపరేషన్ ద్వారా వీరందరిని కూడా సేఫ్ జోన్ కు తరలిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గ్రామంలోకి వాటర్ బోట్ల ద్వారా పంపించిన భూపాలపల్లి జిల్లా అధికారులు బాధితులను ఇండ్లపైకి చేర్చారు. వారికి ఆహారం, తాగునీటిని కూడా పంపించారు. భవనాల మీదుగా హెలిక్యాప్టర్ లను గాలిలో నిలిపి గ్రామస్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.