దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లోకసభ అభ్యర్థి ఫైనల్ చేసే విషయంలో ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. అయితే శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖలు మరింత ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేరిట వైరల్ అవుతున్న ఈ లేఖలు కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి తెరలేపాయి.
ఇద్దరి పేరిట…
కరీంనగర్ ఎంపీ టికెట్ రేసులో వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఎవరో ఒకరి ఫైనల్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతోంది. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికే ఇస్తే బావుంటుందని రాష్ట్రానికి చెందిన నాయకులు అదిష్టానం ముందు ఉంచగా వెలిచాలకు అవకాశం ఇస్తే కూడా బావుంటుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి పేర్లలో ఎవరో ఒకరి పేరు ఫైనల్ చేసే విషయంలో ఇంకా వాయిదాల పద్దతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వెలిచాల రాజేందర్ రావు యాక్టివ్ కావడంతో ఆయన పేరు దాదాపు ఖాయం అయిపోందన్న ప్రచారం బలంగా సాగుతోంది. టికెట్ ప్రయత్నాల్లో హైదరాబాద్, ఢిల్లీకే పరిమితం అయిన రాజేందర్ రావు క్షేత్ర స్థాయిలో టూర్లకు శ్రీకారం చుట్టడంతో రాజేందర్ రావుకు ఏఐసీసీ నుండి క్లియరెన్స్ వచ్చిందన్న ప్రచారం కరీంనగర్ అంతటా పాకిపోయింది. అయితే ప్రవీణ్ రెడ్డి కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని, ఆయనకు రాష్ట్రంలోని ముఖ్య నేతల అండదండలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం అంటోంది. ఈ క్రమంలో శనివారం సాయత్రం నుండి వైరల్ అవుతున్న రెండు లేఖలు అందరినీ గందరగోళంలో పడేశాయి. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరుతో ఉన్న జాబితా కొన్ని వాట్సప్ గ్రూపుల్లో, వెలిచాల రాజేందర్ పేరుతో ఉన్న జాబితా మరికొన్ని గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో కరీంనగర్ అభ్యర్థి ఎవరన్నది మాత్రం అర్థం కాక అటు కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ ఇటు సామాన్య జనం అయోమయంలో పడిపోయారు. అయితే ఏఐసీసీ మాత్రం తెలంగాణ టికెట్ల విషయంలో ఇంకా ఫైనల్ చేయలేదని స్ఫష్టం అవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ‘‘ఎక్స్’’ ద్వారా షేర్ చేసింది. దీంతో తెలంగాణ అభ్యర్థుల విషయంలో ఇంకా ఫైనల్ కానట్టుగా స్పష్టం అవుతోంది. మరో వైపున రాష్ట్రంలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కేవలం కరీంనగర్ స్థానానికి మాత్రమే క్యాండెట్ ఫైనల్ అయినట్టుగా లిస్ట్ షేర్ చేస్తుండడం కూడా అనుమానాలాలకు తావిచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం నిర్వహిస్తున్న ‘‘ఎక్స్’’ అకౌంట్లో మాత్రం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని లోక సభస్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించడం, ఒడిశాలోని అసెంబ్లీ కొన్ని స్థానాలకు కూడా క్యాండెట్లను డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ కరీంనగర్ లో మాత్రం ఆశావాహుల పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖలు మాత్రం అసలైనవి కావని స్పష్టం అవుతోంది.
https://x.com/INCIndia/status/1781686440063119473?t=HvR3hxyLlK9DVFNniKhmzw&s=08