రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెల్లతో సహా ముగ్గురి మృతి…

దిశ దశ, హుజురాబాద్:

జాతరకెల్లి తిరుగు ప్రయాణం అవుతున్న వారిని విధి వెంటాడింది. మొరం టిప్పర్ రూపంలో ఆ ముగ్గురిని మృత్యువు కబళించింది. ఇంటికి తిరిగి వెళ్లేందుకు మూల మలుపు వద్ద వేచి చూస్తున్న వారు మరణించిన తీరు స్థానికులను కలిచివేసింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో గంట విజయ్ (17), గంట వర్ష (15), సింధూజ (18)లు మృత్యువాత పడ్డారు. బోర్నపల్లి పెద్దమ్మ జాతరలో పాల్గొని బైక్ పై తిరుగు ప్రయాణం అయిన వీరు భాగంగా బొడ్రాయి సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఆగిపోయారు. అటు వైపుగా వస్తున్న మొరం లారీని చూసి వెల్లిపోయిన తరువాత ముందుకు వెల్లాలన్న ఉద్ధేశ్యంతో క్రాసింగ్ వద్ద ఆగారు. సైదాపూర్ మండలం గొడిశాల మీదుగా సాగుతున్న నేషనల్ హైవే నిర్మాణం కోసం మొరం తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి వారిపైనే బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విజయ్, వర్ష, సింధూజలపై మొరం పడడంతో చిక్కుకపోయి అక్కడిక్కడ చనిపోయారు. జేసీబీ సాయంతో మొరాన్ని తొలగించి మూడు మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెల్లు విజయ్, వర్షలు చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరుగుతుందని భావించి ముందుగానే క్రాసింగ్ వద్ద నిలిచిపోయిన చోటే టిప్పర్ బోల్తా పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

You cannot copy content of this page