ఉత్తరఖండ్ జైల్ అధికారులకు షాక్…
దిశ దశ, జాతీయం:
రామాయణ నాటకంలో వానరుల వేషం వేసిన ఇద్దరు ఖైదీలు జైలు గోడలు దూకి పరార్ అయ్యారు. విజయ దశమి సందర్భంగా ఖైదీలచే నాటకాల పోటీలు నిర్వహించిన జైలు అధికారులు సీతమ్మను వెతికేందుకు వెల్లే సీన్ లో వానరులుగా నటించిన ఇద్దరు ఖైదీలు పరార్ అయ్యారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఉత్తరఖండ్ రాష్ట్రంలోని రోషనాబాద్ జైలులో రామాయణం నాటక ప్రదర్శనలో ఖైదీలు ఇద్దరు చేసిన పనికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. రామాయణం నాటకంలో భాగంగా పంకజ్, రాజ్ కుమార్ అనే ఇద్దరు ఖైదీలు వానర పాత్రధారులుగా నటించారు. అయితే సీతమ్మను రావాణుడు ఎత్తుకెళ్లిన తరువాత ఆమె కోసం గాలించేందుకు వానరులు కూడా రంగంలోకి దిగే సీన్ కూడా ఇందులో ఒకటి. ఈ సీన్ వేస్తున్న సందర్బంలో సీతమ్మ కోసం వెతుకుతున్నట్టుగా నటించిన పంకజ్, రాజ్ కుమార్ లు 22 అడుగుల ఎత్తులో ఉన్న జైలు గోడలు దూకి అధికారుల కళ్ల ముందే పరార్ అయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదీగా, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. జైలు అధికారులతో పాటు ఇతర ఖైదీలు నాటక ప్రదర్శన చూస్తుండగానే కోతుల వేషం వేసిన వీరిద్దరు గోడ దూకి తప్పించుకోవడం సంచలనంగా మారింది. అయితే ఖైదీలు ఇద్దరు కూడా నాటకంలో భాగంగా గోడ దూకి పరార్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే వీరిద్దరు వానర వేషం వేసేందుకు ముందుకు వచ్చి ఉంటారని, జైలు గోడ దూకేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో కూడా స్కెచ్ వేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే 22 అడుగుల ఎత్తున ఉన్న గోడలను దూకేందుకు వారు కొంతకాలంగా ప్రాక్టీస్ చేసి ఉంటారన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వీరు అంతకు ముందే ఎత్తున ఉన్న గోడలు దూకడంలో సిద్దహస్తులా లేక, జైల్లోనే ప్రాక్టిస్ చేశారా అన్న విషయం తేలాల్సి ఉంది. రోషనాబాద్ జైల్ నుండి పరార్ అయిన ఈ ఇద్దరు ఖైదీల కోసం పోలీసు యంత్రాంగం, జైళ్ల శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.