కేక్ తినిపించుకున్న మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు… అంబేడ్కర్ జయంతి రోజు అరుదైన సన్నివేశం

దిశ దశ, కరీంనగర్:

సిట్టింగ్ ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీ నేతగా ముందుకు సాగారొకరు… ఆయనవన్ని కల్లబొల్లి మాటలేనంటూ కౌంటర్ ఇచ్చారు మరోకరు… సరిగ్గా నాలుగు నెలల క్రితం వరకు వారిద్దరి మధ్య మాటల యుద్దం నెలకొంది. ఒకరి వైఫల్యాలను ఒకరు ఎత్తి చూపుతూ ప్రజా క్షేత్రంలో తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించలేదు. కానీ ఆదివారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఈ ఇద్దరు రాజకీయ ప్రతర్థులు ఒకే వేదికపై కలిసి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తారు.  రాజకీయ క్షేత్రంలో ఉన్న వైరుధ్యాన్ని ప్రదర్శించకుండా సాన్నిహిత్యంగా ముచ్చటించుకున్నారు. ఆ తరువాత కేక్ కట్ చేసి ఒకరి నొకరు తినిపించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న సాక్షాత్కరించిన ఈ సన్నివేశం బద్ద శత్రుత్వం ప్రదర్శించే కొంతమంది నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

గంగాధరలో…

కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆదివారం బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇద్దరు కలివిడిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా వేర్వేరు పార్టీల్లో ఉన్న స్థానిక నాయకులు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటుంటారు. నాయకులు కూడా తమ అనుచరులు ఇతర పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్న విషయం తెలిస్తే ఆగ్రహంతో ఊగిపోతారు. ప్రత్యర్థి పార్టీ నేతలతో ఎలా కలుస్తారంటూ ద్వితీయ శ్రేణి నాయకులపై మండిపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గంగాధర క్రాస్ రోడ్డులో మాత్రం నిన్న మొన్నటి వరకు రాజకీయ శత్రువులుగా ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు విబేధాలను పక్కనపెట్టి అప్యాయంగా పలకరించుకున్న తీరు స్థానికులను ఆకట్టుకుంది. ఎంచుకున్న రాజకీయ సిద్దాంతాలు వేర్వేరే అయినా ఇలాంటి మహానీయుల వేడుకల్లో మాత్రం కలిసిపోయి ఉండడం అందరిని అబ్బురపరిచింది. ఎన్నికల వరకే రాజకీయాలు అంటూ ప్రకటనలు చేసే పొలిటిషయన్స్ ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం ససేమిరా అంటుంటారు. కానీ చొప్పదండి సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సుంకె రవిశంకర్ లు మాత్రం పాలిటిక్స్ మరిచిపోయి క్లోజ్ గా మూవ్ అయిన తీరు ముచ్చటగొలిపింది. ఇలాంటి పరిస్థితులే అన్ని చోట్ల కూడా ఉన్నట్టయితే మంచి వాతావరణం ఏర్పడుతుంది.

You cannot copy content of this page