ధర్మపురి స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీ…
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక అధికారుల బృందం సమగ్ర విచారణ జరిపింది. దాదాపు ఆరున్నర గంటల పాటు జరిగిన విచారణలో పలు కోణాలను ఆవిష్కరించారు అధికారులు.
2018 నుండి 2023 వరకు…
హైకోర్టు ఆదేశాలతో ఈసీఐ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ రవి కిరణ్ లు కొండగట్టు జేఎన్టీయూ ఆవరణలో విచారణ చేశారు. 2018 ఎన్నికలప్పుడు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శరత్, ఆయన తరువాత విధుల్లో చేరిన గుగులోతు రవి, ప్రస్తుతం కలెక్టర్ గా వ్యవహరిస్తున్న యాస్మిన్ భాషాల వాంగ్మూలాలు తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు ఎన్నికల అధికారి భిక్షపతి, కౌంటింగ్ డ్యూటీలో ఉన్న ఇతర తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు పలువురిని విచారించినట్టు సమాచారం. ముఖ్యమైన అధికారుల నుండి వాంగ్మూలం రికార్డు చేసుకున్న ఈసీఐ అధికారుల బృందం క్షుణ్ణంగా ఆరా తీసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కేవలం ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికార యంత్రాంగం, విచారాణాధికారులకు అందుబాటులో ఉండేందుకు అవసరమైన యంత్రాంగాన్ని మాత్రమే జేఎన్టీయూలోకి అనుమతించారు. అయితే విచారణ అధికారులు కూడా ఒక్కొక్కరిని మాత్రమే పిలిపించి ప్రశ్నించి వారి నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు నుండి ఏడు గంటల పాటు జరిపిన ఈసీఐ అధికారుల బృందం బాధ్యులైన అధికార యంత్రాంగం వాంగ్మూలాల ఆధారంగా నివేదిక రూపొందించి హై కోర్టుకు సమర్పించనుంది.
ఒకటి పోతే మరోకటి…
జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగాన్ని ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వ్యవహారం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశంలో ఎంట్రీ ఇచ్చిన ఈసీఐ ఆఫీసర్ల స్పెషల్ టీం ఇచ్చే రిపోర్టు ఎలా ఉంటుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. కౌంటింగ్ ముగిసిన తరువాత స్ట్రాంగ్ రూం తాళం చేతులను నోడల్ ఆఫీసర్ కు అప్పగించానని ఓ అధికారి ఈసీఐ అధికారుల ముందు చెప్పినట్టు సమాచారం. అయితే లిఖిత పూర్వకంగా ఏమైనా ఆదేశాలు జారీ చేసినట్టయితే ఇందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్ కావాలని విచారాణ అధికారి అడిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్ లెటర్స్ కోసం ఎలక్షన్ వింగ్ ఫైల్స్ లో తనిఖీ చేస్తే అవి దొరకలేదని, మరిన్ని చోట్ల కూడా ఆరా తీయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల కమిషన్ నిభందనల ప్రకారం స్ట్రాంగ్ రూం తాళం చేతులు జిల్లా ఎన్నికల అధికారి లేదా డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ వద్ద భద్రపర్చాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూంకు సంబంధించిన కీస్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుండి తీసుకొచ్చామని ఒకరిద్దరు అధికారులు విచారణ అధికారి ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఈసీఐ నిభందనలకు విరుద్దంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూం కీస్ ధర్మపురిలో ఉంచడం ఎలక్షన్ రూల్స్ కు విరుద్దమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి లేదా డిప్యూటీ ఎన్నికల అధికారి ఆధీనంలో ఉండాల్సిన తాళం చేతులు ధర్మపురిలో భద్రపర్చడానికి కారణాలు ఏంటీ అన్నదే మిస్టరీగా మారింది. అంతే కాకుండా తాళం చేతుల విషయంలో మానిటరింగ్ చేశారా లేదా..? జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ రూం కీస్ అప్పగించారా లేదా అన్న విషయాన్ని ఈసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు గదులు ఉన్న స్ట్రాంగ్ రూంలో రెండింటి తాళం చేతులు లభ్యం కాకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. సాధారణంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఇంత దూరం వచ్చేది కాదని హై కోర్టు విచారణలో ఉన్న నియోజకవర్గం గురించి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయంపై ఈసీఐ సీరియస్ గా తీసుకున్నట్టయితే అధికార యంత్రాంగానికి ఇబ్బందులు తప్పవన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతోంది.
ఉత్కంఠతలో అధికార యంత్రాంగం…
తాము ఫలానా వారికి స్ట్రాంగ్ రూం కీస్ అప్పగించామని ఒకరిద్దరు అధికారులు చెప్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వక ఆదేశాలు కావాలని ఎన్నికల అధికారులు అడగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసీఐ రూల్స్ కు అనుగుణంగా వ్యవహరించకపోవడం కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు స్ఫష్టమవుతోంది. ఈసీఐ రూల్స్ ప్రకారం నడుచుకోకపోవడం కూడా అధికార యంత్రాంగాన్ని తప్పు పట్టే అవకాశాలు ఉన్నయన్న చర్చ సాగుతోంది. అయితే హై కోర్టు ఆదేశాలతో విచారించిన ఈసీఐ ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసే అధికారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో అటు హై కోర్టు, ఇటు ఈసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనన్న ఉత్కంఠ అధికార యంత్రాంగంలో నెలకొంది.