టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేస్: మరో ఇద్దరి అరెస్ట్..!

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు తగ్గించడం లేదు. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న వారి కోసం ఇంకా వేట కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ కు చెందిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను బుధవారం సిట్ టీమ్ అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. డీఈ రమేష్ పెన్ డ్రైవ్ లు, ఎలక్ట్రానికి డివైజ్ ల ద్వారా పేపర్లను లీక్ చేసినట్టుగా తేలడంతో ముగింపు దశకు చేరుకున్న ఈ కేసును తిరగదోడాల్సి వచ్చింది. చివరి ఛార్జి షీట్ వేసేందుకు సిట్ సమాయత్తం అవుతున్న క్రమంలో డీఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి రావడంతో మరో కోణంలో దర్యాప్తు చేసింది. ఈ క్రమంలోనే బొమ్మకల్ కు చెందిన మద్దెల శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు, తిమ్మాపూర్ మండలానికి చెందిన వారి గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో వీరందరిని అరెస్ట్ చేసేందుకు సిట్ బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్ మండలానికి చెందిన వారిని అదుపులోకి తీసుకున్న సిట్ బుధవారం మద్దెల శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను అదుపులోకి తీసుకన్నట్టు సమాచారం. వీరిని గురువారం కోర్టులో హాజరు పరయనున్నట్టు సమాచారం. రెండో విడుత దర్యాప్తుతో మద్దెల శ్రీనివాస్ ఫ్యామిలీ అందుబాటులో లేకపోడంతో సిట్ బృందాలు వీరి గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమై చివరకు బుధవారం నాడు వారి ఆచూకి దొరకబట్టుకుని అదుపులోకి తీసుకుంది. వీరి కన్నా ముందు బొమ్మకల్ కు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

కాళేశ్వరం టు బొమ్మకల్…

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లుగా పని చేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయాలు పేపర్ లీకేజీకి దారి తీసినట్టుగా తెలుస్తోంది. బొమ్మకల్ గ్రామానికి చెందిన ఓ ఇంజనీర్ డీఈ రమేష్ లు కాళేశ్వరం నిర్మాణంలో డ్యూటీలు చేశారని ఈ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో మద్దెల శ్రీనివాస్ కూతురి కోసం పేపర్ లీకేజీ చేసేంత సాహాసానికి ఒడిగట్టారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో మద్దెల శ్రీనివాస్ తన కూతురు కోసం పేపర్ కావాలని అడిగినప్పుడు రూ. 70 నుండి 80 లక్షల డీల్ కుదరగా, అంత డబ్బు ఇచ్చుకునే పరిస్థితి లేదని మరో అభ్యర్థికి కూడా పేపర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ మాత్రం తన కూతురుకు ఉద్యోగం వచ్చిన తరువాతే డబ్బులు ఇస్తానన్న ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీఈ రమేష్ నేతృత్వంలో ఎలక్ట్రానికి డివైజ్ ల సహకారంతో కూడా పేపర్ లీకేజీ జరిగిందన్న విషయాన్ని సిట్ గుర్తించడంతో మరి కొంతమంది బండారం బయటపడింది.

80 మంది అరెస్ట్: సిట్

టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటి వరకు మొత్తం 80 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారి గురించి ఆరా తీస్తున్న సిట్ ఇందులో పాత్రాదారులుగా ఉన్న వారిని గుర్తించే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి అయితే లీకేజీ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

You cannot copy content of this page