చల్మెడ హస్పిటల్ భూముల వెనక అసలేం జరిగింది..?
దిశ దశ, కరీంనగర్:
వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చే విషయంలో కూడా రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారా..? బొమ్మకల్ శివార్లలోని భూమి నాలా కన్వర్షన్ చేసేందుకు అనుమతించిన ఫైళ్లను గమనిస్తే విస్తూ పోవల్సిందే. ఒకే ఫైల్ నంబర్ పై వేర్వేరు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని, వేర్వేరు దరఖాస్తు దారులకు నాన్ అగ్రికల్చర్ అసెస్ మెంట్ (నాలా)గా మార్చేందుకు ప్రొసిడింగ్స్ విడుదల కావడం విడ్డూరం. అయితే ఈ ఫైళ్లలో ఒకటి చల్మెడ మెడికల్ కాలేజీకి సంబంధించినది కావడంతో అసలేం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
గురు రాందాస్ సొసైటీ…
కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివారులోని 680, 681, 682, 683, 684, 685, 686, 691, 721, 721/A, 722/A, 72`/F, 722/C, 724/B, 724/D సర్వే నంబర్లలోని 25 ఎకరాల తొమ్మిది గుంటల వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసేందుకు డీఆర్వో కార్యాలయం నుండి ప్రొసిడింగ్స్ విడుదల అయ్యాయి. 2000 సంవత్సరం అక్టోబర్ 31 రోజున D1/5033/2000 ఫైల్ నంబర్ ద్వారా గురు రాందాస్ ఎడ్యూకేషనల్ సొసైటీ రిజిస్ట్రేషన్ నంబర్ 7081/2000కు నాలా కన్వర్షన్ కు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రొసిడింగ్ కాపీలను సొసైటీకి చెందిన కె తిరుపతి రావు తీసుకున్నట్టుగా కూడా రికార్డుల్లో పేర్కొన్నారు.
అరియంత్ సొసైటీ…
బొమ్మకల్. దుర్శేడు శివార్లలోని 114, 254తో పాటు పలు సర్వే నంబర్లకు సంబంధించిన వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కు అనుమతి ఇస్తూ ప్రొసిడింగ్స్ విడుదల అయ్యాయి. ఈ ప్రొసిడింగ్స్ 2001 జనవరి 3న డీఆర్వో కార్యాలయం నుండి విడుదలైన ప్రొసిడింగ్స్ కు కూడా D1/5033/2000 ఫైల్ నంబర్ ఉండడం గమనార్హం. అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ నంబర్ 6634/2000కు నాలా కన్వర్షన్ కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు విడుల అయ్యాయి. రెండు వేర్వేరు విద్యా సంస్థలకు సంబంధించిన నాలా కన్వర్షన్ ఫైల్ నంబర్ ఒకటే ఉండడం గమనార్హం. గురు రాందాస్ సొసైటీకి సంబంధించిన ఫైల్ ను 2000 సంవత్సరం అక్టోబర్ నెలలో, ఇదే ఫైల్ నంబర్ పై 2001 జనవరి నెలలో అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట వ్యవసాయేతర భూమిని మార్చుతూ ప్రొసిడింగ్స్ విడుదల కావడం విచిత్రంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో వేర్వేరు దరఖాస్తు దారులకు సంబంధించిన ఫైళ్లు వేర్వేరు నంబర్లు కెటాయించి కరస్పాండెన్స్ చేస్తుంటారు. కానీ కరీంనగర్ లో మాత్రం ఒకే నంబర్ పై రెండు ఫైళ్లు మూవ్ చేయడం విచిత్రంగా ఉంది. అయితే రెండు ఫైళ్ల ఆధారంగా నాలా కన్వర్షన్ ప్రక్రియకు సంబంధించిన రుసుం సదరు సొసైటీలు చెల్లించారా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. మరో వైపున రెండు నెలల తరువాత ఇచ్చిన ప్రొసిడింగ్స్ కు ఒకే నంబర్ కెటాయించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
సీలింగ్ భూములా..?
అయితే బొమ్మకల్ శివార్లలో సీలింగ్ యాక్టు అమల్లో ఉన్న భూములు ఉన్నాయన్న కారణంతోనే రెవెన్యూ అధికారులు ఒకే నంబర్ పై రెండు ప్రొసిడింగ్స్ తీశారని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపిస్తున్నారు. సీలింగ్ యాక్టు అమల్లో ఉన్న విషయాన్ని విస్మరించి అధికారులు నాలా కన్వర్షన్ కు సంబంధించిన ఫైల్ మూవ్ చేయడమే విచిత్రంగా ఉందన్నారు. జగిత్యాల ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆధేశాల మేరకు సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో నిర్మాణాలు జరిపినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, నాలా కన్వర్షన్ కు సంబంధించిన ప్రొసిడింగ్స్ వేర్వేరు తేదీలలో ఒకే నంబర్ పై తీయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కై ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములను ప్రైవేటు వారికి ధారాదత్తం చేసే కుట్ర పన్నినట్టుగా అనుమానం వస్తోందన్నారు. చల్మెడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన భూమి విషయంలో ఉన్నతాధికారులు సరైన రీతిలో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శేఖర్ అంటున్నారు. నిజాలు వెలికి తీసి సీలింగ్ పరిధిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నట్టయితే ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవాలని, లేనట్టయితే నిరుపేదలకు నివేశన స్థలాలు కెటాయించినా బావుంటుందని అంటున్నారు. కరీంనగర్ రెవెన్యూ అధికారుల తప్పిదాలపై సమగ్రంగా ఆరా తీయాల్సిన అవసరం ఉందని శేఖర్ అభిప్రాయపడ్డారు.