బడిబాట పట్టని విద్యార్థులు… అటెండెన్స్ తో సరిపెడ్తున్న టీచర్లు

వాతావరణం ఎఫెక్ట్…

దిశ దశ, హైదరాబాద్:

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల హైస్కూల్ అది… ఐదు తరగతులు నడుస్తున్న ఈ పాఠశాలకు వస్తున్న విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి…

సోమవారం: 04

మంగళవారం: 06

బుధవారం: 11

గురువారం: 10

శుక్రవారం: 05

ఈ నెల 12న స్కూల్స్ రీ ఓపెన్ నుండి సర్కారు పాఠశాలల వైపు విద్యార్థులు కన్నెత్తి చూడడం లేదు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో తల్లి దండ్రులు కూడా విద్యార్థులను బడికి పంపించేందుకు సాహసించడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి నుండి 10 తరగతుల వరకు తరగతులు కొనసాగుతున్న హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య అరాకొరాగానే ఉంటోంది. దీంతో 12వ తేది నుండి పాఠశాలలకు టీచర్లు వెల్లడం… సమయం ముగియగానే ఇంటి బాట పట్టడం రివాజుగా మారింది. గతంలో ఏనాడు లేని విధంగా ఈ ఏడాది స్టూడెంట్స్ స్కూళ్లకు వెల్లడానికి నిరాసక్తత చూపుతున్నారు.

వాతావారణంలో మార్పులు…

వాస్తవంగా వేసవి కాలం ముగిసి పోయి దండిగా వర్షాలు కురవాల్సిన సమయం వచ్చినా చినుకు జాడ కనిపించడం లేదు. మృగశిర కార్తె కూడా వచ్చినప్పటికి రుతు పవనాలు మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో రోహిణీ కార్తెను మరిపించిన విధంగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో జూన్ మూడో వారంలోకి అడుగు పెట్టినప్పటికీ మే రెండో వారాన్ని మరిపిస్తున్నాయి ఎండలు. భగభగలాడుతున్న భానుడి ప్రతాపం ఎఫెక్ట్ కు తోడు ఉదయం 10 గంటల నుండే వస్తున్న వడ గాల్పులు కూడా ఇబ్బందికరంగా మారాయి. తరగతి గదుల్లో కూర్చునే తమ బిడ్డలు వాతావరణం కారణంగా అనారోగ్యానికి గురవుతారన్న ఆందోళన పేరెంట్స్ లో వ్యక్తమవుతోంది. వేడి ఎంత తీవ్రంగా ఉందంటే విద్యార్థులు తాగేందుకు తీసుకెల్తున్న బాటిల్స్ లోని నీరు కూడా వేడెక్కిపోతున్నాయి. సాయంత్రం 6.30 గంటల వరకూ ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో పెద్దలు కూడా బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. నిండు వేసవిలో వడగండ్ల వానల వల్ల వాతావరణం చల్లబడితే… ఇప్పుడేమో భానుడి ప్రతాపం ప్రతి ఒక్కరిని పరేషాన్ చేస్తోంది. చిన్నారుల నుండి పండు ముదుసలి వరకు కూడా వాతావరణాన్ని చూసి భయపడిపోతున్నారు. ఏటా ఇదే సమయంలో 30 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉన్న ఉష్టోగ్రతలు ఇప్పుడు మాత్రం 40 నుండి 43 డిగ్రీల వరకు నమోదు అవుతుండడం ఆందోళన కల్గిస్తున్న పరిణామం. అటవీ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, గిరులు విస్తరించిన ప్రాంతాల్లో అయితే ఎండల తీవ్రత మరింత ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపించి కొత్త సమస్యలు కొనుక్కోవడం అవసరమా అని తల్లిదండ్రలు అంటున్నారు. ఇటీవల రుతు పవనాలు వచ్చే సూచనలు కనిపించిన అవి వెనక్కి వెల్లిపోవడంతో ఇప్పట్లో వరుణుని రాక కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని వాతవారణ శాక అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప సాధారణంగా అయితే మరిన్ని రోజులు మండుటెండల నడుమనే జీవనం సాగించాల్సి ఉంటుంది.

విద్యార్థుల ఇంటి బాటలో టీచర్లు…

నిన్న మొన్నటి వరకు బడిబాట కార్యక్రమంతో విద్యార్థులు సర్కారు బడిలో చేర్పించేందుకు వీధుల్లో కలియతిరిగిన టీచర్లు ఇప్పుడు బడిలో చేరిన స్టూడెంట్స్ ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులు స్కులుకు రావాలని చెప్పేందుకు వారి ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. మండుతున్న ఎండల్లో తమ పిల్లలను ఇప్పేడే స్కూలుకు పంపించేది లేదని పేరెంట్స్ చెప్తున్నారు. అయినప్పటికీ టీచర్లు వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

దశాబ్ది ఉత్సవాలపై ప్రభావం..

అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే సమయంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను కూడా అన్ని చోట్ల నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విభాగాల వారిగా ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో వివరిస్తూ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఈ సారి ఎండల ప్రభావం కల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం విద్యాశాఖ ద్వారా అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. ఈ నెల 19న సోమవారం నాడు పాఠశాలను అరిటి, కొబ్బరి ఆకులు, పూలతో అలంకరించడం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సందేశాన్ని పేరెంట్స్ కు అందజేయాలని షెడ్యూల్ ఇచ్చారు అలాగే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, విద్యా కమిటీ ఛైర్మన్ పాఠశాల దాతలు, గ్రామంలోని పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని, సోమవారం ఉదయం 7 గంటలకు హెచ్ఎంలు, టీచర్లు, విద్యార్థఉలు పాఠశాలకు చేరుకోవాలని ఆదేశించారు. 7.15 గంటలకు గ్రామంలో ర్యాలీగా వెల్లి పేరెంట్స్ ను ప్రత్యేకంగా ఆహ్వనించాలని, ఈ సందర్భంగా ర్యాలీలో విద్యాభివృద్దికి దోహదపడే విధంగా నాటకాలు, కళా ప్రదర్శనలు ఇవ్వాలని, 9 గంటలకు పాఠశాల ఆవరణలో జెండా ఆవిష్కర చేయాలని వివరించారు. పాఠశాల ఆవరణలో స్టేజీ ఏర్పాటు చేసి అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ, క్విజ్, ఆటలు చేపట్టి అందులో గెలుపొందిన వారికి 20న బహుమతులు అందజేయడం, ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ ఉపాధ్యాయులు, దాతలకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించడతో పాటు డిజిటిల్ క్లాసుల ద్వారా విద్యా సంస్కరణలపై తల్లిదండ్రలుకు అవగాహన కల్పించడం, మన ఊరు మన బడి కార్యక్రమం వివరాలను కూడా తెలపాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ 80 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 10 నుండి 20 శాతానికి మించి జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్ది ఉత్సవాల క్యాలెండర్ ను అమలు చేయడం ఎలా అని టీచర్లు మదనపడిపోతున్నారు. ఏది ఏమైనా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ కార్యక్రమాలకు సపరేట్ షెడ్యూల్ ఇచ్చి ఎండల తీవ్రత తగ్గే వరకు బడులకు సెలవులు ఇస్తేనే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page