అక్కడ నేత… ఇక్కడ యువత…

మంథని సమీకరణాలపై చర్చ

దిశ దశ, మంథని:

మంథని బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం ఇక్కడి నుండి టికెట్ ఆశించి పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయిన చందుపట్ల సునీల్ రెడ్డి అభ్యర్థిత్వానికి చెక్ పడిందా అన్న చర్చ మొదలైంది. అయితే తమ నేతకే టికెట్ ఇస్తారంటూ సునీల్ రెడ్డి వర్గం వాదిస్తున్నప్పటికి చకాచకా మారుతున్న సమీకరణాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కాషాయం నీడలోకి ‘చల్ల’

మంథని నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ చల్ల నారాయణరెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా నారాయణరెడ్డి బీజేపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మంతనాలు చల్ల నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో జరుపుతూనే మరో వైపున ఆయన క్యాడర్ ను కూడా రంగంలోకి దింపారు. మంథని టికెట్ చల్ల నారాయణరెడ్డికే ఇవ్వాలని కోరుతు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కూడా కలిసి నారాయణ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరారు. అయితే ఇప్పటికే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు నారాయణ రెడ్డి పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నదని ఇందుకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకుంటున్నదని బండి సంజయ్ వారితో చెప్పారు. దీంతో నారాయణ రెడ్డి బీజేపీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతూ తనకే టికెట్ దక్కేందుకు శత విధాల ప్రయత్నాలు చేశారు. చివరకు అధిష్టానం పెద్దల నుండి కీలకమైన హామీ రావడంతోనే ఆదివారం ఆయన బీజేపీలో చేరే లాంఛనం పూర్తయిందని ఆయన అనుచరులు చెప్తున్నారు.

సునిల్ రెడ్డి ధీమా…

మరో వైపున నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న చందుపట్ల సునీల్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీ నాయకత్వం ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో సునీల్ రెడ్డి, బండం వసంత్ రెడ్డిలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయిపోయిందన్న ప్రచారం విస్తృతంగా జరిగినప్పటికీ గత 15 రోజులుగా మంథనిలో మారిన సమీకరణాలు ఆయన అభ్యర్థిత్వం ప్రకటనకు బ్రేకులు వేశాయి. అయినప్పటికీ పార్టీ నిర్మాణంలో ప్రత్యేకంగా కృషి చేయడంతో పాటు గతంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినప్పుడే సునీల్ రెడ్డికి 10 వేల వరకు ఓట్లు వచ్చాయని, ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే బలమైన అభ్యర్థిగా గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని సునీల్ రెడ్డి అనుచరులు అంటున్నారు. అంతేకాకుండా అధిష్టానం పెద్దలు కూడా సునీల్ రెడ్డి అభ్యర్థిత్వానికే అనుకూలంగా ఉన్నారని కూడా వాదిస్తున్నారు.

అయోమయం…

మంథని నియోజకవర్గ బీజేపీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చల్ల నారాయణ రెడ్డి పేరు పరిశీలో మాత్రమే ఉండేదని అయితే ఆయన అధికారికంగా పార్టీలో చేరడంతో ఖచ్చితమైన హామీ ఇచ్చి ఉంటారన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. అధిష్టానం పెద్దలు నారాయణరెడ్డికి హామీ ఇచ్చినందునే బీజేపీ స్టేట్ చీఫ్ సమక్షంలో కాషాకం కండువా కప్పుకున్నారని అంటున్నారు. ఆదివారం మంథనిలో జరిగిన పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. హైదరాబాద్ లో సీనియర్ నేత చల్ల నారాయణ రెడ్డి బీజేపీలో చేరగా, మంథని సునీల్ రెడ్డి సమక్షంలో మహదేవపూర్ మండలం సురారం గ్రామానికి చెందిన యువతతో పాటు పలువురు బీజేపీలో చేరారు. దీంతో మంథని బీజేపీలో నెలకొన్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అధిష్టానం చివరి క్షణంలో ఎవరివైపు మొగ్గు చూపుతుందోనన్న చర్చలు సాగుతుండగా, ఎవరి అభ్యర్థిత్వం ఖరారు అయితే ఎవరికి నష్టం ఉంటుంది అన్న అంశం గురించి కూడా మంథనిలో చర్చించుకుంటున్నారు.

You cannot copy content of this page