కరీంనగర్ బీజేపీలో అనూహ్య పరిణామాలు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ భారతీయ జనతా పార్టీలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఇంతకాలంలో పార్టీలోనే కొనసాగిన నాయకులపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో రాజీనామా లేఖలు వైరల్ అయ్యాయి. దీంతో కరీంనగర్ బీజేపీలో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.
సస్పెన్షన్ ఉత్తర్వులు…
కరీంనగర్ బీజేపీకి చెందిన కార్పోరేటర్లు మర్రి భావన, కచ్చు రవి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి సతీష్ లు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పుడతున్నారని సస్పెండ్ చేశామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. వీరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని, వారం రోజుల్లోగా వీరు తమ ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5.25 నిమిషాల ప్రాంతంలో కరీంనగర్ బీజేపీ నాయకులు ఈ ప్రకటనను మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు.
రాజీనామా…
అయితే ఈ లేఖ విడుదలైన కొద్దిసేపట్లోనే కరీంనగర్ బీజేపీ కార్పోరేటర్లు మర్రి భావన, కచ్చు రవి, బీజేవైఎం నేత మర్రి సతీష్ లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఓ ప్రకటన విడుదల చేశారు. వీరు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలోనే ఈ ప్రకటన విడుదల చేశామని పేర్కొనడంతో పాటు… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గత నాలుగున్నరేళ్లుగా కరీంనగర్ ప్రజలకు దూరంగా ఉంటున్నారని, ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించకుండా, ఎన్నకున్న ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. కరీంనగర్ ప్రజల నుండి ఛీత్కారాలను ఎదుర్కొవడం జరుగుతున్నదని, డివిజన్లలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నోసార్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకవెళ్లినా ఎలాంటి సహకారం ఇవ్వటం లేదన్నారు. దానివల్ల తమను ఎన్నకున్న డివిజన్ ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నామని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ద లేని, ప్రజలకు అందుబాటులో లేని బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పనిచేయలేక బీజేపీకి రాజీనామా చేస్తున్నామని వివరించారు.
ఎన్నికలకు ముందు…
ఇప్పటికే కరీంనగర్ కార్పోరేషన్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న పలువురు కార్పోరేటర్లు బీజేపీని వీడగా తాజాగా మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ప్రకటన వెలువడడం, ఆ తరువాత వారు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ బీజేపీలో నెలకొన్న ఈ పరిణామాలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో కరీంనగర్ కూడా ఉండగా, ఇక్కడి పార్టీలోనే సస్పెన్షన్లు, రాజీనామాల పర్వం తెరపైకి రావడం సంచలనంగా మారింది.