కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్…

సీఎంగా డిప్యూటీ… డిప్యూటీగా సీఎం…

దిశ దశ, జాతీయం:

హారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో అసాధ్యాలు సుసాధ్యం అవుతున్నాయి. ఓడలు బండ్లు అవుతాయని… బండ్లు ఓడలు అవుతాయన్న నానుడికి అచ్చు గుద్దినట్టుగా సరిపోతున్నాయి ఇక్కడి రాజకీయ సమీకరణాలు. కారణాలు ఏవైనా… అంతర్గత ఒప్పందాలు ఏం జరిగినా మహా రాష్ట్ర రాజకీయాలు మాత్రం సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పవచ్చు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరకు ముఖ్యంత్రిగా దేవేండ్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు బాధ్యతలు తీసుకోబోతున్నారు.

కుడి ఎడమైంది…

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్… ఓడి పోలేదోయ్ అన్నట్టుగానే వాణిజ్య రాజధానిలో పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ ఏక్ నాథ్ షిండ్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఇదే పెద్ద సంచలనంగా మారడంతో పాటు ఓ ఇంటర్వ్యూలో కూడా ఫడ్నవిస్ మాట్లాడుతూ… తనను డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడ్తారని అస్సలు ఊహించలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని తాను కాదనలేకపోయానని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతి ఎక్కువ సీట్లు సాధించడంతో సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఏక్ నాథ్ షిండ్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వర్తించిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతుండగా ఆయన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా తాజా మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యవహరించనున్నారు. ఏక్ నాథ్ షిండ్ క్యాబినెట్ లో మాజీ సీఏం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే, అదే డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ సీఎంగా వ్యవహరిస్తున్న సర్కారులో మాజీ సీఎం డిప్యూటీ సీఎంగా పదవి అలంకరించబోతున్నారు.

అంత్యంత అరుదే…

అయితే మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు డిప్యూటీ సీఎం పదవిని అలంకరించేందుకు విముఖత చూపుతుంటారు. అంతకు ముందు పనిచేసిన పదవి కంటే తక్కువ స్థాయిలో తాను బాధ్యతలు చేపట్టలేనని భీష్మించుకున్న నాయకులే ఎక్కువ. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సీఎంగా పనిచేసిన నాయకులు డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగేందుకు ముందుకు రావడం విచిత్రమనే చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు గవర్నర్లుగా పని చేసిన వారు రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సందర్బాలు ఉండగా, కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా వ్యవహరించి రాష్ట్ర క్యాబినెట్ లో బెర్త్ దక్కించుకున్న నాయకులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారూ ఉన్నారు. కానీ సీఎంగా పనిచేసి డిప్యూటీ సీఎం బాధ్యతల్లో కొనసాగిన వారు మాత్రం ఒక్క దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండేలు మాత్రమే కావడం గమనార్హం. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటే ఇదేనేమో మరి.

You cannot copy content of this page