మంథని బీజేపీలో టఫ్ ఫైట్…

తెరపైకి బీఆర్ఎస్ రెబల్ పేరు

ముఖ్యనేతలను కలుస్తున్న శ్రేణులు

దిశ దశ, మంథని:

అభ్యర్థి ఫైనల్ అనుకున్న తరుణంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయక్కడ. ఆ నియోజకవర్గంలో ఏకైక నాయకుడు ఆయనే కాబట్టి అభ్యర్థి ఆయనే అన్న భావనలో చేరుకున్నప్పటికీ ఊహించని విధంగా మరో నేత పేరు తెరపైకి రావడం గమనార్హం.

మంథని బీజేపీలో…

పెద్దపల్లి జిల్లా మంథని బీజేపీ అభ్యర్థి విషయం హోల్డ్ లో పడిపోయినట్టయింది. కొంతకాలంగా ఇక్కడ పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న చందుపట్ల సునీల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖాయమని అనుకున్నప్పటికి అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన చల్ల నారాయణ రెడ్డి పేరు పరిశీలనకు రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ చల్ల నారాయణరెడ్డి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అప్పటికే స్వతంత్ర్య అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన బీజేపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం ఆరంభించారు. దీంతో చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే విషయంలో బీజేపీ ముఖ్య నాయకులు తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. నారాయణ రెడ్డి పేరుకే టికెట్ ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్టుగా సమాచారం. అయితే కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బండం వసంతరెడ్డి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆయన కూడా బీజేపీ నాయకులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరుతున్నట్టు సమాచారం.

‘బండి’ని కలిసిన శ్రేణులు…

తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కూడా మంథని ప్రాంతానికి చెందిన పలువురు కార్యకర్తలు కలిశారు. శనివారం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కలిసిన వారంతా కూడా నారాయణ రెడ్డి, వసంతరెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన బలం బలహీనతల గురించి కూడా వారు సంజయ్ కు వివరించినట్టు సమాచారం. అయితే బండి సంజయ్ మాత్రం మంథని నాయకులు చెప్పిన అంశాలన్ని విన్న తరువాత మంథనిలో గెలిచే అభ్యర్థి గురించి మరో సారి సర్వే చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా సూత్రప్రాయంగా తెలిపారు. ఆ సర్వేలో ఎవరు బలమైన వ్యక్తో తెలుసుకున్న తరువాత అభ్యర్థిన ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని, తాను ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకోలేనని వివరించినట్టు సమాచారం.

You cannot copy content of this page