దిశ దశ, కరీంనగర్:
కాళేశ్వరం ఆలయంలోకి డ్రెస్ కోడ్ లేకుండా వెల్లి పూజలు చేసిన బీఆర్ఎస్ఎల్పీ నేతల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మానికి విరుద్దంగా ఆలయంలోకి వెల్లడం సరైన చర్య కాదన్నారు. శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయంలోకి వెల్లిన ఎమ్మెల్యేలంతా నాస్తికులేనని వ్యాఖ్యానించారు. సాంప్రాదాయాలకు విరుద్దంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.
మర్చంట్ బ్యాంకుల రుణాలు…
తెలంగాణ ప్రభుత్వం మర్చంట్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అధిక వడ్డీలు చెల్లిస్తూ వేల కోట్ల అప్పులు చేస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా రుణాలు తీసుకోవడం లేదని చెప్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై బీజేపీని బద్నాం చేస్తున్నారని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందన్న భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి మూర్ఖంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆరోపణలు విమర్శలు చేస్తూ కాలం వెల్లదీయడం మాని కలిసి పని చేసుకుంటేనే బావుంటుందన్నారు. కేంద్రం తెలంగాణాకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని, పదేళ్లలో రూ. 10 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణాకు ఇచ్చిందన్నారు. వివిధ పథకాల పేరిట మంజూరు చేసిన ఈ నిధుల వివరాలన్ని కూడా ఉన్నాయన్నారు. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారానికి నిధులు కెటాయించిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఆర్ఓబీల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకున్నా కూడా కేంద్రం నండి వంద శాతం నిధులు కెటాయించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం తానిచ్చిన నిధులని చెప్పుకుంటోందని, అయితే కేంద్రం నిదులతో చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం సరికాదన్నారు. సమావేశానికి హాజరై రాష్ట్ర అవసరాల గురించి అడిగినట్టయితే బావుండేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారెంటీ స్కీంలకు నిధులు ఎందుకు కెటాయించలేదని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, బొడిగె శోభ, రాణి రుద్రమలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.