జూన్ 2 నాటికి పదేళ్లు…
దిశ దశ, హైదరాబాద్:
విభజన చట్టానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్రీకృతంగా రాజకీయాలకు తెరలేచిందా..? నిన్న మొన్నటి వరకు ఏపీ నేతల నోట వినిపించిన జాయింట్ క్యాపిటల్ ముచ్చట ఇప్పుడు బీఆర్ఎస్ నేత నోట వినిపిస్తోంది. అయితే ఆయన కేంద్ర పాలిత ప్రాంతమంటూ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు ప్రారంభం కానున్నట్టుగా స్పష్టం అవుతోంది.
జూన్ 2తో…
ఈ ఏడాది జూన్ 2తో పదేళ్లు ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుండి హైదరాబాద్ తెలంగాణాకు మాత్రమే రాజధాని కానుంది. 2014 నుండి 2024 వరకు పదేళ్లు గడిచినందున ఏపీకి సపరేట్ రాజధానిగా ఏర్పాటు చేసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో గతంలో ఏపీ నేతలు కూడా ఉమ్మడి రాజధాని అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. మరి కొంతకాలం హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న ప్రతిపాదనలు చేశారు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించి జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ నే యాథావిధిగా కొనసాగించే విధంగా ఆధేశాలు ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. అయితే ఈ అంశం అంతా కూడా మరుగునపడిపోగా తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు…
ఆదివారం కరీనంగర్ ఉమ్మడి జిల్లాలో లోకసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జూన్ 2 తరువాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీసూ అవకాశం ఉంది. హైదరాబాద్ లేని తెలంగాణాను ఊహించుకోలేమన్న ఆందోళనలు ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అలాగే ఫ్రీ జోన్ అంశంపై కూడా తెలంగాణ ప్రజలు రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందోనన్నది అంతుచిక్కకుండా పోయింది. ఉద్యమ సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాష్ట్రానికి శాశ్వత రాజధాని చేయాలన్న డిమాండ్ వినిపించగా, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఈ ప్రపోజల్స్ విషయంలో అగ్గిమీద గుగ్గిల అయ్యారు. ఇప్పుడు కూడా అదే అంశం తెరపైకి తీసుకరావడం వెనక బలమైన కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు లోకసభ ఎన్నికల ప్రచార సభలో కావడం… కొంత కాలంగా బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు తెలంగాణ సమాజంపై పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఈ కారణంగానే కేటీఆర్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు సీరియస్ గా తీసుకోనట్టుగా అర్థమవుతోంది. యూనియన్ టెరిటరీ అంశం బలంగా వినిపించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ లాభపడుతుండన్న అంచనాలు కూడా లేకపోలేదు. ఈ కారణంగానే కేటీఆర్ వ్యూహాత్మకంగా కేంద్ర పాలిత ప్రాంతం అంశాన్ని లేవనెత్తి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.