ఇసుక రీచుల్లో కటిక దోపిడి…?

నెట్టింట వైరల్ అవుతున్న లారీ ఓనర్ లేఖ

దిశ దశ, భూపాపల్లి:

సర్కారు ఆదాయం మాటున సాగుతున్న అక్రమాల తంతు అంతా ఇంతా కాదన్న ఆరపణలు వస్తున్నాయి. ఇసుక రీచుల్లో అక్రమాల జాతరకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో స్టాకు యార్డుల్లో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగుతోంది. ఇష్టారీతిన జరుగుతున్న ఈ తంతును కట్టడి చేయడంలో అధికార యంత్రంగా ఎందుకు పట్టించుకోవడం లేదోనన్నదే అంతుచిక్కకుండా పోయింది. తాజాగా భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ ఇసుక రీచులో జరుగుతున్న అక్రమాల తంతు గురించి నెట్టింట వైరల్ అవుతున్న లేఖ సంచలనంగా మారింది. మహదేవపూర్ మండలం పల్గుల 10 రీచులో లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ నెల 5న పల్గుల 10 రీచులో ఈ విధంగా జరగగా 16న కుంట్లం రీచుకు వెల్లినప్పుడు రూ. 2,500 అదనంగా డబ్బులు ఇవ్వాలని అడిగారని సదరు లారీ యజమాని అందులో పేర్కొనడం గమనార్హం. మొదటి సారి అడిగినప్పుడే టీఎస్ఎండీసీ అధికారులకు ఫిర్యాదు చేశానని తాజాగా కుంట్లం రీచులో జరుగుతున్న తంతుపై కూడా వాట్సప్ ద్వారా కంప్లైంట్ చేసినట్టు ఆ లేఖలో వివరించాడు.

అదనపు బకెట్ల దందా..?

అయితే టీఎస్ఎండీసీ అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా లారీల్లో అదనపు బకెట్ల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ ట్రా బకెట్ కు ఒక్కో క్వారీ లో ఒక్కో రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఒక్కో బకెట్ కు. 2 వేల నుండి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నా టీఎస్ఎండీసీ మాత్రం ఈ విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభిస్తోంది. అదనపు బకెట్ దందా వల్ల ఒక్కో రీచు నుండి రోజుకు లక్షల్లో ఆదాయం కోల్పోతున్నా కట్టడి చేసే వారే లేకుండా పోయారు. అంతేకాకుండా ఓవర్ లోడ్ కారణంగా రోడ్లు కూడా విధ్వంసానికి గురువుతున్నాయి. దీంతో అటు వచ్చే ఆదాయం రాకపోగా ఇటు వేసిన రోడ్లు అస్థిత్వం కోల్పోవడంతో వాటిని బాగు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అయినప్పటికీ టీఎస్ఎండీసీ యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. రీచుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి వారిపై పర్యవేక్షించేందుకు ప్రాజెక్టు ఆఫీసర్లకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించినా అదనపు బకెట్ దందా మాత్రం సర్వసాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఈ ప్రాంతం మీదుగా వేసిన జాతీయ రహదారి కూడా దెబ్బతిన్నప్పటికీ ఓవర్ లోడ్ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది.

అక్కడే ఆర్థిక లావాదేవీలెందుకు..?

అంతా ఆన్ లైన్ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నప్పుడు రీచుల్లో రోజూ లక్షల్లో డబ్బు ఎందుకు చేతులు మారుతోందన్నదే అంతుచిక్కడం లేదు. ముందుగా టీఎస్ఎండీసీకి అన్ని రకాలుగా డబ్బు బదిలీ చేసిన తరువాత వే బిల్లు అలాట్ అవుతోంది. రీచుల వద్దకు వెల్లిన లారీకి సంబంధించిన వే బిల్లు చూపించగానే లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రతి రీచుల్లో ఆర్థిక లావాదేవీఎందుకు జరుగుతున్నాయన్నది మిస్టరీగా మారింది. అవినీతి నిరోధక అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ రీచుల్లో ఆకస్మిక దాడులు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడే అవకాశాలు లేకపోలేదన్నది నిజం. ఆన్ లైన్ ట్రాంజక్షన్ జరుపుతున్నప్పుడు రీచుల్లో డబ్బులు ఉండడమే నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇవేవి పట్టించుకునే పరిస్థితుల్లో యంత్రాంగం లేకపోవడంతోనే ఇష్టారాజ్యంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇసుక సక్రమ రవాణా ద్వారా ఎంత మొత్తంలో సర్కారు ఖజానకు చేరుతోందో సగానికి సగం దందా అక్రమంగా సాగుతూ ఆ డబ్బు ఎవరి చేతుల్లోకి చేరాలో వారికి చేరిపోతోందన్న ప్రచారం రీచుల్లో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలు కట్టడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుదని అంటున్న వారూ లేకపోలేదు. తాజాగా ఓ లారీ ఓనర్ ఇచ్చిన ఫిర్యాదుతో టీఎస్ఎండీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

You cannot copy content of this page