లేఖ రాసిన ఛైర్మన్
దిశ దశ, హైదరాబాద్:
టీఎస్ఎండీసీ ఛైర్మన్ మన్నె క్రిషాంక్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో తనకు సంస్థ నుండి ఇచ్చే వేతనంతో పాటు ఇతర భత్యాలు కూడా నిలిపి వేయాలని కోరుతూ టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ కు లేఖ రాశారు. తన అకౌంట్లో వేతనంతో పాటు, భత్యాలను వేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 11నే రాసినట్టుగా ఉన్న ఈ లేఖను క్రిషాంక్ అక్టోబర్ 30వ తేది ఉదయం 9.10 నిమిషాలకు ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తాను 50 రోజుల పాటు పార్టీ కార్యకలాపాలకే పరిమితం కానున్న నేపథ్యంలో టీఎస్ఎండీసీ నుండి వేతనం తీసుకోవడం సరికాదన్న అభిప్రాయాన్ని క్రిషాంక్ వ్యక్తం చేశారు. ఎన్నికల మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ ముగిసే వరకు తన అకౌంటకు వేతనంతో పాటు భత్యాలకు సంబంధించిన డబ్బును బదిలీ చేయకూడదని కోరారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు ఎవరూ కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత పార్టీ కార్యకలాపాలకే పరిమితం అవుతుంటారు. తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకే పనిచేస్తు, ఇంఛార్జీగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో వారు అధికారిక సేవలు పొందడం సాధారణంగా మారిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే క్రిషాంక్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ అమల్లో రావడంతో తాను పార్టీ కార్యకలాపాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నందున ఈ సమయంలో తాను వేతనం తీసుకోవడం సముచితం కాదన్న అభిప్రాయాన్ని క్రిషాంక్ వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టుకు సంబంధించిన సంస్థ నుండి వచ్చే వేతనాలు, ఇతర భత్యాలు వద్దని కోరుతూ లేఖ రాసిన మొదటి వ్యక్తి క్రిషాంక్ కావచ్చు. అయితే ఇదే సాంప్రాదాయాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది అమలు పరుస్తారో వేచి చూడాలి. అయితే టీఎఎస్ఎండీసీ ఛైర్మన్ క్రిషాంక్ ఈ నెల 11నే ఎండీకీ లేఖ రాసినప్పటికీ దీనిని ఈ రోజు ‘ఎక్స్’లో షేర్ చేయడం వెనక కారణాలు ఎంటీ అన్నదే అర్థం కాకుండా ఉన్నది.