మంథని పాలి‘ట్రిక్స్’
దిశ దశ, పెద్దపల్లి:
మేధావుల పుట్టినిల్లు… ఉద్యమ ప్రస్థానానికి వేదికగా పేరు గాంచిన ఆ నియోజకవర్గ రాజకీయాలు మరణాలు, దాడుల చుట్టే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇతరుల మరణాలే వేదికగా రాజకీయాలు సాగగా ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చిందనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల మధ్య నెలకొన్న వైరం ఇంత దూరం తీసుకొస్తోందా లేక స్థానికంగా ఏర్పడ్డ వైషమ్యాలే ఇందుకు కారణం అవుతున్నాయో తేల్చాల్సిన ఆవశ్యకత అయితే ఉంది.
గతంలో ఇలా…
పెద్దపల్లి జిల్లా మంథనికి ఓ ప్రత్యేకత ఉంది. దేశానికి ప్రధానిని అందించిన ఘన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే పివి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1950 దశాబ్దంలోనే బీబీసీ రిపోర్టర్ గా పనిచేసిన ముద్దు కృష్ణయ్య కూడా మంథనికి చెందిన వారే అలాంటి మంథనిలో నేడు మరణాల చుట్టే రాజకీయాలు సాగుతుండడం విస్మయం కల్గిస్తోంది. ప్రేమ వ్యవహారంలో మరణించిన మంథని మధూకర్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా మధూకర్ ఫోటోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చివరకు హై కోర్టు ఆదేశాలతో రీ పోస్టు మార్టం కూడా నిర్వహించాల్సి వచ్చింది. మహాముత్తారం మండలానికి చెందిన కవిరాజు ఆత్మహత్య, మల్హర్ మండలానికి చెందిన రెవెల్లి రాజబాపు, మంథని పోలీస్ స్టేషన్ లో మరణించిన శీలం రంగయ్యల మరణాలన్ని కూడా పొలిటికల్ కలర్స్ అంటుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య విషయంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంథని పేరు మారుమోగింది. వామన్ రావు తండ్రి కిషన్ రావు తన కొడుకు హత్య విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా న్యాయ స్థానాలకు లేఖలు రాస్తూ హంతకుల విషయంలో రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. రిటైర్డ్ టీచర్ కూడా అయిన కిషన్ రావు వామన్ రావు హంతకులకు శిక్షపడే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఈ మరణాల విషయంలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మంథనిలో పర్యటించి ఆరోపణలు చేశారు. ఆ తరువాత మాత్రం ఆయా కుటుంబాల గురించి పట్టించుకున్న వారే లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు తన కుమారుడి హత్యను జీర్ణించుకోలేక వెంటపడుతున్నారు తప్ప మిగతా మరణాలన్ని కూడా మరుగున పడిపోయాయనే చెప్పవచ్చు. వామన్ రావు హత్య విషయంలో మంథని బార్ అసోసియేషన్ ఫిబ్రవరి 17ను బ్లాక్ డేగా పాటిస్తోంది తప్ప మిగతా వారెవ్వరూ కూడా వామన్ రావు మర్డర్ కేసును పట్టించుకోవడం లేదు. ఁ
ఇప్పుడు జర్నలిస్టుల వంతా..?
ఇకపోతే ఇప్పుడు జర్నలిస్టు ఆత్మహత్యతో సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఆరంభం అయింది. రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ తన ఆత్మహత్యకు ఫలనా వారే కారణమంటూ పేర్కొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటాపోటి పోస్టింగుల పర్వం సాగుతోంది. శ్రీకాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా విమర్శలు కూడా చేశారు. దీంతో మరోసారి మంథని రాజకీయాలు వేడెక్కాయి. పోటాపోటి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు ఇరు పార్టీలకు చెందిన నాయకులు. మరో వైపున మరో రిపోర్టర్ మధుపై దాడి జరగడంతో తీవ్ర గాయాల పాలు కాగా ఆసుపత్రిలో చేరారు. ఈ కేసులో నిందితులను రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రామగిరి మండలానికి చెందిన ఓ రిపోర్టర్ ఆత్మహత్య చేసుకోగా మరో రిపోర్టర్ పై దాడి జరగడం గమనార్హం.
మూలాలపై నజర్…
అయితే రామగిరి మండలంలో నెలకొన్న ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన తరువాత ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో అసలు విషయం తప్పుదారి పట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీసి ఈ గొడవలకు మూల కారకులపై కఠినంగా వ్యవహారించాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్న వారూ లేకపోలేదు. జర్నలిస్టులు కూడా రాజకీయ రంగు పులుముకోవడం వల్లే ఇంత దూరం వచ్చిందా లేక వీరి వెనక ఉండి నడిపిస్తున్న వారెవరూ అన్న విషయాన్ని గుర్తించి సమాజం ముందు ఉంచింతే క్రిమినల్ పాలిటిక్స్ చేసే వారి బండారం బయటపడనుంది. దీంతో ఇలాంటి వారితో సమాజం కూడా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆత్మహత్య అయినా, మర్డర్ అయినా, దాడులే అయినా పునరావృతం కాకుండా చూసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.