తెచ్చిందెవరు… ఇచ్చిందెవరు..?
దిశ దశ, కరీంనగర్:
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగడం ఖాయమన్న చర్చ జరుగుతున్న క్రమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నట్టుగా ఉంది. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో అంతా లక్ష సెల్ ఫోన్ల చుట్టే సాగుతోంది.
కరీంనగర్ వేదికగా…
కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్ధులు కదనరంగంలోకి దూకారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా నియోజకవర్గంలో లక్ష సెల్ ఫోన్ల గురించే హాట్ టాపిక్ గా మారింది. ఒకటా రెండా కరీంనగర్ ఓటర్లలోని దాదాపు మూడో వంతు సెల్ ఫోన్లు కరీంనగర్ కు వచ్చాయని వీటిని పంచేందుకు అంతా సిద్దమైందన్న ఆరోపణలు తీవ్రంగా మొదలయ్యాయి. కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మంత్రి గంగుల కమలాకర్ తన గెలుపు కోసం లక్ష సెల్ ఫోన్లను, ఓటుకు రూ. 10 వేలు పంచేందుకు సమాయత్తం అయ్యారంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో దాదాపు 2.90 లక్షల ఓటర్లు ఉండగా లక్ష సెల్ ఫోన్లను నమ్ముకున్నాడని సంజయ్ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు కౌంటర్ అటాక్ చేసేందుకు రంగంలోకి దిగింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ లు బండి సంజయ్ ఆరోపణలను తిప్పి కొట్టారు. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి బండి సంజయే లక్ష సెల్ ఫోన్లు తెచ్చారని తమకు సమాచారం ఉందని ఆరోపించారు. దీంతో రెండు ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపన్లలో సెల్ ఫోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారిపోయింది. రెండు పార్టీల నాయకులు ఈ అంశంపై ఎంత సీరియస్ గా స్పందిస్తున్నారంటే తమ పార్టీ గుర్తు పేరు కాకుండా సెల్ ఫోన్ గురించే చర్చించే స్థాయికి చేరుకున్నారు. దీంతో కరీంనగర్ సిటీ వాసులు కూడా ఈ లక్ష సెల్ ఫోన్ల గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు.
నిఘా కళ్లుగప్పి..?
అయితే ఇరు పార్టీల నాయకులు చేసుకుంటున్న ఈ ఆరోపణలపై స్థానికులు మరో విధంగా కూడా చర్చిస్తున్నారు. నగరంలోకి ఏక కాలంలో లక్ష సెల్ ఫోన్లు తీసుకొచ్చే పరిస్థితులు నెలకొని ఉన్నాయా..? జిల్లా నలుమూలల ఎన్నికల అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అభ్యర్థులు, అనుమానితుల చుట్టూ షాడో టీమ్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంత పెద్దమొత్తంలో సెల్ ఫోన్లు తీసుకరావడం సాధ్యమేనా అన్న విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. మరికొందరైతే ప్రజలకు తామేం చేశామో చెప్పుకునే ప్రయత్నం చేయకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సెల్ ఫోన్లను తీసుకరావడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కొన్ని వర్గాలకే పరిమితం అయిన ప్రలోభాల పర్వం ఇప్పుడు అన్ని వర్గాల వారిని పాకిందా అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే డేగ కళ్లతో నిఘా వేసిన ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి సెల్ ఫోన్లు ఓటర్లకు ఎలా పంచుతారో చూడాలి మరి అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లక్ష సెలపోన్ల పంపిణీ కీలకంగా మారనుందా లేక కావాలనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది.