దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించలేడనుకున్నాడో… లేక… తన ఇంతి వేషం వేసుకుంటే తానేం చేసినా చెల్లుతుందనుకున్నాడో తెలియదు కానీ దొంగతనం కోసం ఆ ప్రబుద్దుడు వేసిన భారీ స్కెచ్ మాత్రం అందరినీ నవ్విస్తోంది. ఎవరికీ చిక్కకూడదనుకుని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు మాత్రం చోరీ గుట్టు రట్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డిపేటకు చెందని రామిండ్ల నాంపల్లి భవనంలో అద్దెకు కొన్ని షాపులు నడుస్తున్నాయి. ఓ దుకాణాన్ని సింగారం గ్రామానికి చెందిన బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఎప్పటిలాగానే రాత్రి తన షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు ఫ్లెక్సీ దుకాణ యజమాని లక్ష్మీనారాయణ. మరునాటి ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చి చూసే సరికి షాపు వెనక తలుపు తెరిచి ఉండడంతో అనుమానించిన ఆరా తీశాడు. ఈ క్రమంలో తన షాపులో చోరీ జరిగిందని ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అతని దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ కూడా గమనించి పోలీసులకు ఇచ్చారు. అయితే సీసీ ఫుటేజీలో రికార్డయిన ఆడ వ్యక్తని గమనించి మహిళా దొంగ ఎవరని ఆరా తీసే పనిలో పడ్డారు. ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో మహిళా దొంగలు ఎంట్రీ ఇచ్చారా..? ఏదైనా ముఠా ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం లభ్యం కాకపోవడంతో ఈ మహిళా దొంగ ఎవరబ్బా అని మల్లగుల్లాలు పడుతున్నారు. షాపు పరిసర ప్రాంతాల్లోనూ ఆరా తీస్తున్న క్రమంలో భవనం యజమాని కొడుకుపై అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జల్సాలకు అలవాడు పడిన ఇంటి యజమాని సుధీర్ ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషాధారణ ధరించి తమ భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. తన ఉనికి తెలియకుండా ఉండాలని భావించిన సుధీర్ తన భార్య వినియోగించే వెంట్రుకల సవరం, డ్రస్ ధరించి చోరీకి పాల్పడ్డాడు. షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయం తెలిసే ఆయన ముఖానికి మాస్కు కట్టుకుని మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు దర్యాప్తులో అన్ని కోణాల్లో ఆరా తీసినప్పటికీ చోరీకి పాల్పడిన వారి గురించి బయటకు పొక్కకపోగా, వారిలో వచ్చిన ఓ అనుమానం కాస్తా నిజమైంది. దీంతో సుధీర్ ను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఇంతకీ సుధీర్ చోరీకి పాల్పడిన నగదు ఎంతో తెలుసా..? రూ. 3,500. తన జల్సా కోసం అత్యంత విలువైన ఆస్తులు ఉన్నా కూడా సుధీర్ దారి తప్పిన తీరుపై పోలీసులు విస్మయం వ్యక్తం చేయగా… అతను వేషం మార్చిన తీరు తెలుసుకుని నవ్వుకుంటున్నారు.