దిశ దశ, జాతీయం:
దశాబ్దాల క్రితం ఆయన పేరు వినగానే ఉలిక్కిపడ్డ పరిస్థితి. అడవులనే సామ్రాజ్యంగా ఏర్పర్చుకుని గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేసే ఆయన కొన్ని రాష్ట్రాల అధికార యంత్రాంగానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా. ఆయనను పట్టుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. చివరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు ఆయన్ని ఎన్ కౌంటర్ చేశాయి. ఆయన చరిత్ర ఇతివృత్తంగా సినిమాలు కూడా వచ్చాయంటే ఆయన ఏ స్థాయిలో స్మగ్లర్ గా ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. ఆయనే వీరప్పన్… ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఆయన అంటేనే హడలిపోయిన పరిస్థితి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరప్పన్ కూతురు ఇప్పుడు చట్ట సభకు పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. 32 ఏళ్ల విద్య వీరప్పన్ లోకసభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీలో ఉన్న విద్య వీరప్పన్ కు కమలనాథులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తాజాగా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలో్ చేరారు.