హైవే నిర్మాణంలో అపశృతి… పేలుడుతో వాహనాల ధ్వంసం

 

దిశ దశ, మానకొండూరు:

వరంగల్, కరీంనగర్ హైవే నిర్మాణంలో కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం కారణంగా అపశృతి చోటు చేసుకుంది. ఫోర్ లేన్స్ నిర్మాణంలో భాగంగా రోడ్డును చదును చేసేందుకు బ్లాస్టింగులకు పాల్పడడంతో అటుగా వెల్తున్న పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో రోడ్డుపై బ్లాస్టింగ్ కు పాల్పడడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పేలుడు కోసం మందుగుండు సామాగ్రి ఉపయోగించిన ప్రాంతానికి కనీసం 500 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపాల్సి ఉన్నప్పటికీ వంద మీటర్ల వరకు వాహనాలను అనుమతించడంతో భారీ ఎత్తున వాహనాలు ధ్వంసం అయినట్టు స్థానికులు తెలిపారు. విధ్వంసం ప్రభావంతో రాళ్లు రప్పలు గాల్లోకి ఎగిరి పడడంతో వాహనాల రూప్ లు అద్దాలకు రంధ్రాలు పడడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. 563 నేషనల్ హైవే పై చేసిన ఈ బ్లాస్టింగ్ తీవ్రత వల్ల వాహనాల్లో ప్రయాణించే వారికి ఎలాంటి గాయాలు కాకున్నప్పటికీ వెహికిల్స్ మాత్రం డ్యామేజ్ అయ్యాయి. దీంతో వాహనదారులు కాంట్రాక్టు కంపెనీ యంత్రాంగం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నిభందనల ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో బ్లాస్టింగులు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను సుదూర ప్రాంతాల్లో ఆపి పేలుడు కోసం మందుగుండు సామాగ్రిని ఉపయోగించకుండా వాహనాలు సమీపంలోకి వచ్చిన తరువాత బ్లాస్టింగ్ చేయడం వల్ల వాహానాలు దెబ్బతిన్నాయి. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో పేల్చివేతలకు పాల్పడేందుకు నిభందనలు సహకరిస్తాయా లేదా అన్న విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం ఫలితంగా తమ వాహనాలను బాగు చేయించుకునేందుకు జెబులు గుల్ల చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తమకు జరిగిన ఈ నష్టాన్ని పూడ్చడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ సైజులో బండరాళ్లు ఉన్నట్టయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని తొలగించాలని కానీ పేళుడుకు పాల్పడడం సరికాదని స్థానికులు అంటున్నారు. బ్లాస్టింగ్ వల్ల చెల్లాచెదురుగా పడిపోయిన రాళ్లు సమీపంలో ఉన్న వారిపై పడినట్టయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని… ఈ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా వ్యవహరించారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

You cannot copy content of this page