కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోకసభ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
దిశ దశ, కరీంనగర్:
బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో రైతులను, రైతు సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో రైతులు చీత్కరించినా మళ్లీ కొత్త డ్రామాలతో తెరమీదకు వస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో రుణమాఫీ విషయాన్నే మర్చిపోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో 8 నెలల కాలంలోనే అమలు చేస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలకు దిగుతున్నారన్నారు. 20 వేల కోట్ల రుణమాఫీని సక్రమంగా అమలు చేయని అసమర్థులు మీరు కాదా అని ప్రశ్నించారు. ఐదారు విడతల్లో మీరు చేసిన రుణమాఫీ రుణాల తాలూకు వడ్డీలకే సరిపోయిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. 8 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 31 వేల కోట్లతో రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేశారన్నారు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదని, త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకుల తీరును రైతులు సైతం చీత్కరించుకుంటున్నారని అన్నారు. రైతుబంధు పేరిట 25 వేల కోట్ల రూపాయలు అప్పనంగా గత బీఆర్ఎస్ పాలకులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అడవులు, గుట్టలు పడావు ఉన్న భూములకు ఇష్ట రాజ్యాంగ రైతుబంధు పంచి పెట్టారని వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు.