దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మరో ముఖ్య నేత చేరనున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కుటుంబం నుండి వచ్చిన ఆ నాయకుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ కావడమే ఆలస్యమని తెలుస్తోంది.
కుటుం బ నేపథ్యం ఇది…
తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన రాజేందర్ రావు మరోసారి తన భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సమాయత్తం అయ్యారు. దాదాపు దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టి తన సత్తా చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతి రావు ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. రామడుగు మండలం గుండి గోపాలరావు పేట సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ లెజస్లేచర్ల ఫోరం కన్వీనర్ గా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ గా వంటి బాధ్యతల్లో కొనసాగారు. మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా పనిచేసిన జగపతిరావు కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ నేపథ్యం గురించి ఆయన ఎన్నో రచనలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, 1950లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పని చేసిన కేశవరావు మనవడే రాజేందర్ రావు.
ఆయన కెరీర్ ఇదే…
న్యూ ఢిల్లీలోని రామ్ జాస్ కాలేజీలో బీఏ హానర్స్ డిగ్రీ పూర్తి చేసిన రాజేందర్ రావు ఉస్మానియాలో 1981 నుండి 1983లో ఎంబీఏ పూర్తి చేశారు. ఓ నిర్మాణ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన 1989లో గుండిగోపాల్ రావుపేట సింగిల్ విండో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.1991 నుండి 1994 వరకు కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా, మార్కెట్ కమిటీ ఛాంబర్ స్టేట్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1992లో నెడ్ క్యాప్ డైరక్టర్ గా నామినేటెడ్ పోస్టులో బాధ్యతలు నిర్వర్తించారు. 2001 నుండి 2004 వరకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా యువజన, విద్యార్థి విభాగాల ఇంఛార్జిగా కూడా పని చేశారు. 2004లో చొప్పదండి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి 30 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ నుండి 2009లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్పీ అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన రికార్డు ఆయనకే దక్కింది. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీఆర్పీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల టూర్ షెడ్యూల్ కు ఇంఛార్జిగా కూడా వ్యవహరించారు.
ఎంపీగా మరోసారి…
కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్ రావు ఆసక్తిగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా తనకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలతో పాటు, తన కుటుంబ నేఫథ్యం కూడా లాభిస్తుందని రాజేందర్ రావు ఆశిస్తున్నారు. కరీంనగర్ లో బలమైన అభ్యర్థి కూడా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చినట్టయితే పార్టీ బలం కూడా తోడు అవుతుందని దీనివల్ల తన గెలుపు సునాయసం అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్న ఆయన ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల టచ్ లోకి వెల్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం.