‘చెన్నమనేని’ టికెట్ పై క్లారిటీ
గెలుపు గుర్రాలను వదులుకోం
బీఆర్ఎస్ నేత బోయినపల్లి స్పష్టం
దిశ దశ, వేములవాడ:
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమైన వేములవాడ ఎమ్మెల్యే టికెట్ విషయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చేశారు. టికెట్ కావాలని ఆశించడంలో తప్పు లేదు… కానీ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది అని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోనూ 99 శాతం సీట్లు సిట్టింగులకే కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారని సర్వేలు చెబుతున్నందును అభ్యర్థులను ఎందుకు మార్చుతామని వినోద్ కుమార్ ప్రశ్నించారు. వేములవాడ విషయానికొస్తే నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు నాలుగు సార్లు గెలిచి ప్రజల మదిలో నిలిచిన రమేష్ బాబును తాము ఎందుకు దూరం చేసుకుంటామన్నారు. నామినేషన్ వేయడమే ఆలస్యం అన్నట్లుగా ఆయన్ను గెలుపు తీరాలకు తీసుకెళ్తున్న నియోజకవర్గ ప్రజల ఆదరణ ముందు తామంతా నామమాత్రులమేనని బోయినపల్లి వ్యాఖ్యానించారు. పార్టీ అన్నప్పుడూ ఆశావహులు ఉండటం సహజమే… అంత మాత్రానా గెలుపు గుర్రాలను వదిలిపెట్టి కొత్తవారికి టిక్కెట్ ఇస్తే తీరని నష్టం జరుగుతుంది కదా అని అన్నారు. ప్రస్తుతానికయితే వేములవాడ విషయంలో ఎలాంటి కొత్త ఆలోచన లేదని, వందకు వంద శాతం రమేషే తమ అభ్యర్థి ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోకూడదని వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.