తుల ఉమ చుట్టే వేములవాడ రాజకీయం

రహస్యంగా బీజేపీ నేతల మంతనాలు

కాంగ్రెస్ నేతల రాయబారాలు

దిశ దశ, వేములవాడ:

వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ చుట్టే వేములవాడ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధిష్టానం స్పష్టమైన ప్రకటనతో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన తుల ఉమకు కమలనాథులు బిగ్ షాక్ ఇచ్చారు. చెన్నమనేని వికాస్ రావుకు బిఫారం పంపడంతో వేములవాడ బీజేపీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయింది. బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆగ్రహంతో ఊగిపోతున్న తుల ఉమ విమర్శనాస్త్రాలను సంధించడం ఆరంభించారు. తన చేతిలోకి వచ్చిన టికెట్ ను లాక్కున్నారన్న ఆవేదనతో తుల ఉమ చెన్నమనేని కుటుంబంపై నిప్పులు చెరిగారు. మరో వైపున బీజేపీ విధానాన్ని కూడా ఎండగడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడైనా తాను విప్లవపంథాలో కొనసాగినప్పుడు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బావుండేదన్న అభిప్రాయాలను ఆమె హితులు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పరిస్థితులను తయారు చేసినట్టుగా చేసి అగ్రవర్ణాల వైపే మొగ్గు చూపిన తీరుపై తుల ఉమ చేస్తున్న వ్యాఖ్యలపై ఇతర వర్గాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నదే హాట్ టాపిక్ గా మారిపోయింది.

రాయబారల్లో బీజేపీ నేతలు…

తుల ఉమకు చివరి నిమిషంలో ఇచ్చిన షాక్ నుండి తేరుకునే పరిస్థితి లేకుండా పోయిన సమయంలోనే బీజేపీ టికెట్ దక్కించుకున్న చెన్నమనేని వికాస్ రావు తరుపున తుల ఉమతో రాయబారాలు నడుపుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు తుల ఉమను శాంతింపజేసేందుకు కీలక వ్యక్తులు రంగంలోకి దిగినా ఆమె మాత్రం ససేమిరా అంటున్నట్టు సమాచారం. టికెట్ ఇవ్వకపోయినా కనీసం తనతో చర్చించి, అధిష్టానం పెద్దలు ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని నెలకొలిపిన తరువాత బిఫారం ఇచ్చినా బావుండేది కానీ అలాంటి చొరవ తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. తానిప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితిల్లో లేనని చెప్తూనే చివరి నిమిషంలో అధిష్టానం నిర్ణయంతో తనకు ఎదురైన అనుభవం వల్ల ఎంతటి మానసిక క్షోభకు గురయ్యానో తెలుసా..? ఆ పరిస్థితి ఎదుటి వారికి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ దూకుడు…

మరో వైపున కాంగ్రెస్ పార్టీ తుల ఉమకు బాసటగా నిలిచేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. శుక్రవారం రాత్రే వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తుల ఉమను కలసి మాట్లాడారు. చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాను వెంటనే నిర్ణయం తీసుకోలేనని ఆలోచించిన తరువాత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తుల ఉమ ఆది శ్రీనివాస్ తో చెప్పారు. అయినప్పటికీ శనివారం సాయంత్రం ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథన్, ఆది శ్రీనివాస్ లు సానుభూతిని ప్రకటించారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వనించేందుకు రాలేదని వెల్లడించిన విష్ణునాథన్ ఆమెకు బీజేపీ అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటారన్నారు. తుల ఉమ మాత్రం మరో రెండు మూడు రోజుల వరకు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం లేదని వారితో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా వేములవాడ ఎన్నికల ప్రచారానికన్న తుల ఉహ ఎపిసోడే ప్రధాన చర్చనీయాంశంగా మారిపోవడం గమనార్హం.

You cannot copy content of this page