ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైతం నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. పెళ్లి అయిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని తెలిపారు. కాంగ్రెస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు.