దిశ దశ, కరీంనగర్:
గాయపడి అచేతనవస్థకు చేరుకున్న ఈ పాముకు ప్రాణం పోశారక్కడి వైద్యులు. పాము ఉందన్న సమాచారం అందుకోగానే జంతు సంరక్షణ శాలకు చెందిన బృందం పామును స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ లోని కమాన్ ఏరియాలో పాము అచేతనంగా పడిపోయి ఉందని శ్రీ లక్ష్మీ జంతు సంరక్షణ శాల నిర్వాహకులకు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సంరక్షణ శాల బృందం కమాన్ ఏరియాకు వెల్లి పామును పట్టుకుని జిల్లా పశు వైద్య శాలకు తరలించారు. పశు వైద్యశాలలోని డాక్టర్లు పాము తీవ్రంగా గాయపడి ఉందని గమనించి శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ దశకు చేరుకున్న పామును కాపాడారు. పామును రెండు రోజుల పాటు సంరక్షణలో ఉంచాలని వెటర్నరీ డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు శ్రీ లక్ష్మీ పశు సంరక్షణ శాల నిర్వహకులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల తరువాత వైద్యుల సలహా మేరకు అటవీ ప్రాంతంలో వదిలేస్తామని నిర్వహాకులు తెలిపారు.
