దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ సమీపంలోనే నిరసన వ్యక్తం చేస్తూ సూసైడ్ అటెమ్ట్ కు పాల్పడ్డారు. బాధితుడు అశోక్ చెప్తున్న వివరాల ప్రకారం… కరీంనగర్ లోని గాంధీ రోడ్ లో తన వస్త్ర దుకాణం పక్కనే బ్రాందీ షాపుకు అనుమతి ఇచ్చారన్నారు. ఈ విషయంపై గతంలో పలు మార్లు గాంధీరోడ్డులో ఆందోళనలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యాపార పరంగా నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్ లో వైన్ షాపు ఏర్పాటు చేయడం వల్ల స్థానికులతో పాటు కొనుగోలు దారులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మందుబాబుల రాకపోకలతో గాంధీరోడ్ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని నివసిస్తున్న వారికి కూడా ఆటంకంగా మారిన వైన్ షాపును మార్చేయాలని పదే పదే కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తన వస్త్ర దుకాణం పక్కనే వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో మందుబాబులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన షాపులో అమ్మకాలు జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయే ప్రమాదం ఏర్పడిందని బాధితుడు వాపోయాడు. అయితే గాంధీరోడ్ లోని బ్రాందీ షాపును తొలగించాలంటూ కలెక్టరేట్ ఆవరణలో ఆవేదన వెల్లగక్కిన అశోక్ అనూహ్యంగా తన వద్ద ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకుని తలపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనతో పాటే వచ్చిన వారు అతన్ని వారించారు.
లైసెన్స్ రద్దు చేయాలి: గుడికందుల సత్యం
కరీంనగర్ గాంధీరోడ్ లో ఏర్పాటు చేసిన వైన్ షాపు లైసెన్సును వెంటనే రద్దు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నిరసన చేపట్టిన అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ… గాంధీ రోడ్ లో 80 శాతం మంది చిరు వ్యాపారులే ఉన్నారని ఈ వైన్ షాపు కారణంగా వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారన్నారు. నిరంతరం ఈ ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని వైన్ షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా వైన్ షాపు సమీపంలోనే హనుమాన్ ఆలయం ఉన్నా కూడా అధికారులు వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమానుల సంఘం అధ్యక్షులు వెంకటేశం, మహిళా సంఘం నాయకురాలు కవిత, సిపిఎం నగర కమిటీ సభ్యులు కొంపల్లి సాగర్,పుల్లెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.