కొంప ముంచుతున్న అనుచర గణం…
తెరపైకి వస్తున్న బాధితులు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో అధికార పార్టీకి మరో రూపంలో సమస్యలు ఎదురవుతున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తున్నా కొద్ది అధికార పార్టీకి వ్యతిరేకంగా బాధితులు తెరపైకి వస్తుండడం గమనార్హం. అప్పుడు తామేం చేసినా చెల్లుతుందని భావించిన అధికార పార్టీ నాయకుల తీరు నేడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే తమ ఆస్తులను కాజేస్తున్నారన్న వేదనతో సామాన్యుడు భయం గుప్పిట జీవనం సాగించాడు. అయితే వీటన్నింటికి కారణం కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చెప్పు చేతల్లో ఉండడమేనన్నది వాస్తవం.
తెరపైకి బాధితులు…
తాజాగా కరీంనగర్ ల్యాండ్ మాఫియా ఆగడాల తీరుపై ఓ బాధితుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార రథంపైకి ఎక్కి మరీ తన ఆవేదన వెల్లగక్కారంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజిరెడ్డి అనే బాధితుడు చెప్తున్న కథనాన్ని బట్టి మంత్రి గంగుల కమలాకర్ బినామీలు, బాధితులు ఆయన భూమికి ఎసరు పెట్టారని స్పష్టం అవుతోంది. మూడు సార్లు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు మూడు సార్లు టీఎస్ బీపాస్ లో దరఖాస్తు చేసుకున్నానని రాజిరెడ్డి వివరించారు. తనకు తీరని అన్యాయం చేశారని తనలాంటి బాధితులు ఎంతో మంది ఒక్క భగత్ నగర్ ప్రాంతంలోనే ఉన్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే మంత్రి గంగుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎంఐఎం కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రేకుర్తిలోని ముస్లిం మైనార్టీ పేదలకు చెందిన ఇండ్లను కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాధితుల పక్షన బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్న ఎంఐంఎం ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా రేకుర్తికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా తాజాగా మైనార్టీ నాయకుడు మోసీన్ ఆహ్మద్ ఖాన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్బంగా రేకుర్తి మైనార్టీల ఇండ్ల కూల్చివేత అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి గంగుల ప్రత్యక్ష్య ప్రమేయమో లేక పరోక్ష ప్రమేయమో ఉందో లేదో తెలియదు కానీ కరీంనగర్ తో పాటు సమీప గ్రామాల్లో మాత్రం ఆయన పేరు వాడుకుని ఇష్టారీతిన దురక్రామణలకు పాల్పడ్డారు. ఈ ల్యాండ్ మాఫియా, సెటిలిమెంట్ మాఫియా అంతా కూడా గంగుల కమలాకర్ ను ప్రజాక్షేత్రంలో విలన్ లా మార్చేశారన్న చర్చ అయితే సాగుతోంది.
చక్ర బంధమేనా..?
ఆయనతో మొదటి నుండి వెన్నంటి నడిచిన బ్యాచ్ అంతా కూడా తెరమరుగైపోగా కొత్తగా చేరిన గ్యాంగ్ ల వల్ల గంగుల చరిష్మా మసక బారిపోవడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లోకి చేరకముందు నుండి అనుబంధం పెనవేసుకున్న వారు కూడా గంగుల చుట్టూ చేరిపోయిన బ్యాచుల చక్రబంధాన్ని దాటుకుని ఆయన వద్దకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేసిన వారెందరో. టీడీపీలో తొలితరం నాయకులుగా ఉన్న వారు కూడా గంగుల కమలాకర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన మంత్రి అయిన తరువాత దరి చేరే పరిస్థితి లేకుండా పోయిందన్న చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో సాగుతోంది. ఈ కారణంగానే సీనియర్ నాయకుడు వాసాల రమేష్ తో పాటు మరికొంతమంది కొత్తపల్లి కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీల నుండి ఫిరాయింపులను ప్రొత్సహించడం సరైందే అయినప్పటికీ సొంతపార్టీ ముఖ్య నాయకులను విస్మరించడం సరికాదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.
బాధితుడు రాజిరెడ్డి ఆవేదన మీరే వినండి