సైబర్ ఫ్రాడ్ కంపెనీల వ్యూహం… ఉపాధి పేరిట విదేశాలకు తరలింపు…

క్షేమంగా చేరిన మధుకర్ రెడ్డి…

దిశ దశ, కరీంనగర్:

ఉపాధి దొరుకుతుందన్న ఆశతో బ్యాంకాక్ చేరుకున్న అతన్ని మయన్మార్ పంపించారు సైబర్ ఫ్రాడ్ కంపెనీ ప్రతినిధులు. చైనాకు చెందిన సైబర్ నేరాల ముఠా ప్రతినిధులు అతన్ని బందించారు. సైబర్ నేరాలకు పాల్పడాలని ఒత్తిడికి గురి చేస్తుండడంతో తనకు చెప్పిన ఉద్యోగానికి అక్కడకు చేరుకున్న తరువాత చేయిస్తున్న పనికి సంబంధం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం మధుకర్ రెడ్డితో పాటు 540 మంది భారతీయులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్ నుండి తెలంగాణ వరకు పలు రాష్ట్రాలకు చెందిన యువత చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీ కబంద హస్తాల్లో చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవడంతో వారంతా క్షేమంగా ఇండియాకు చేరుకోగలిగారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని రెసిండెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కు బాధ్యతలు అప్పగించారు. రెండు విమానాల్లో ఢిల్లీ చేరుకున్న తెలుగు రాష్ట్రాల 24 మంది బాధితులు హైదరాబాద్ చేరుకునే వరకూ పర్యవేక్షించారు.

ప్రాణాలతో ఉంటామనుకోలేదు…

మయన్మార్ దేశంలోని మైవాడి జిల్లాలో చైనీస్ ఫ్రాడ్ కంపెనీ ప్రతినిధుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన వారంతా క్షేమంగా స్వస్థలాలకు చేరడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అక్కడ ఎదురైన అనుభవాలను బట్టి తమ స్వస్థలాలకు చేరుతామా లేదా అన్న భయంతోనే కాలం వెల్లదీశామని అంటున్నారు. స్వస్థలాలకు చేరుకునేందుకు తమను కాపాడేందుకు ఎవరు చొరవ తీసుకుంటారని, సాధారణ జీవనం గడుపుతున్న తమ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా అన్న ఆందోళనతోనే కాలం వెల్లదీశామని బాదిత యువత అధికారుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఎన్ఐఏ విచారణ…

అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బుధవారం రాత్రి చేరుకున్న మయన్మార్ చైనీస్ ఫ్రాడ్ కంపెనీ బాధితులను ఎయిర్ పోర్టులోనే అధికారులు నిలిపివేశారు. వారిని తరలించేందుకు వచ్చిన విమానం ల్యాండ్ అయినప్పటికీ తమ వారు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందారు. అయితే ఇమ్మిగ్రేషన్ వద్ద ఉన్న ఇంటలీజెన్స్ బ్యూరో (IB) అధికారులు బాధితుల నుండి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడంతో పాటు సీబీఐ కూడా వారి నుండి వివరాలు సేకరించింది. బాధితులకు సంబంధించిన మొబైల్స్ అన్ని స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థల ప్రతినిధులు వాటిని రిట్రైవ్ చేసే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. అలాగే గురువారం బాధితులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఒక్కొక్కరి నుండి మయన్మార్ లో ఎదురైన అనుభవాలు, వారిని విదేశాలకు ఏ ఉద్యోగం పేరిట తీసుకెళ్లారు, ఏజెంట్లు ఎవరు, వారికి ఎంత మొత్తం చెల్లించారు తదితర సమగ్రమైన వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల నుండి పూర్తి సమాచారం రాబట్టిన తరువాత వారిని స్వస్థలాలకు పంపిచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సైబక్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. మానవ అక్రమ రవాణా చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నం అయింది.

మయన్మార్ లో బారత దేశానికి చెందిన బాధితులను తరలిస్తున్న వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.


You cannot copy content of this page