డిప్యూటీ తహసీల్దార్ ఇంటి ముందు ఆందోళన…

కరీంనగర్ అలకాపురిలో ఘటన

హుస్నాబాద్ నుండి వచ్చిన బాధితులు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన బాధితులు నిరసన చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగి కుటుంబం తమను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం… హుస్నాబాద్ కు చెందిన భైరి చిరంజీవి కుటుంబానికి చెందిన స్థిరాస్థులు గౌరవెల్లి రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో కొనుగోలు చేయాలని భావించారు. హుస్నాబాద్ లో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న కొయ్యాడ లాస్య ఆమె భర్త రమేష్ లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగాం శివార్లలోని సర్వే నెంబర్ 505, 507. 508లలో భూమి ఉందని అది మీకు విక్రయిస్తామని చెప్పారు. 9.16 ఎకరాల భూమికి గాను రూ. 70 లక్షలు చెల్లించిన తరువాత రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయడంతో బాధితులు నిలదీయడంతో ఈ భూమిపై కోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారని, కేసు ఉన్న విషయం తెలిసి కూడా తమకు అమ్మేందుకు ప్రయత్నించి రూ. 70 లక్షలు తీసుకున్నారని వారు ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగితే మంథని లాయర్లకు పట్టిన గతే పడుతోందని కూడా హెచ్చరించారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డిప్యూటీ తహసీల్దార్ లాస్యతో పాటు ఆమె భర్తపై కూడా కేసు నమోదయినట్టు బాధిత కుటుంబానికి చెందిన చొప్పరి శ్రీనివాస్ వివరించారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో లాస్య ఉద్యోగం పోతుందని డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి చెక్కు ఇచ్చారని వివరించారు. అయితే ఈ చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకులో జమ చేయగా రెండు సార్లు కూడా బౌన్స్ అయిందని తెలిపారు. అప్పటి నుండి లాస్య, రమేష్ దంపతులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమి, ఇళ్లు గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురి కావడంతో వచ్చిన పరిహారం తాలుకు డబ్బులు డిప్యూటీ తహసీల్దార్ లాస్య దంపతులకు ముట్టచెప్పడంతో తాము ఇబ్బందులు పుడుతున్నామని చొప్పరి శ్రీనివాస్ ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న లాస్య ఆమె భర్త రమేష్ లు తమకు డబ్బులు తిరిగి చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక ఆదివారం కరీంనగర్ అలుకాపురి కాలనీలోని డిప్యూటీ తహసీల్దార్ లాస్య ఇంటి వద్ద నిరసనకు పూనుకున్నామని వెల్లడించారు. అయితే లాస్య కుటుంబ సభ్యులు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులచే ఆందోళన విరమింపజేశారు. తమకు తీరని అన్యాయం చేసిన లాస్య ఆమె భర్త రమేష్ లపై చట్టపరంగా శిక్షించడంతో పాటు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

You cannot copy content of this page