ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకున్న బాధితులు
దిశ దశ, జగిత్యాల:
కరీంనగర్ లో మద్యాహ్నం డ్యూటీ దిగి అక్కడి నుండి జగిత్యాలకు వెల్లి… అక్కడి నుండి ధర్మపురికి వెల్తూ మార్గమధ్యలో మరో గ్రామంలో ఆగి రాత్రి ఇంటికి చేరుకున్న వ్యక్తి మద్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడి 2 వేలు దొంగతనం చేశాడంటూ తప్పుడు కేసు నమోదు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన రోజున కూడా నేరుగా పోలీస్ స్టేషన్ కో, ఆసుపత్రికో, కోర్టుకో తీసుకెళ్లకుండా సాయంత్రం వరకూ వివిధ ప్రాంతాల్లో తిప్పి తన భర్త జైలు కెళ్లే విధంగా వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను బాధితులు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధితురాలు సాక కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ధర్మపురి పట్టణంలోని హనుమాన్ వాడలో నివాసం ఉంటున్న తమపై ధర్మపురి ఎస్సై ఉదయ్ కక్ష్య పూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జగిత్యాల డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న సాక శేఖర్ జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడని. జులై 29న హైదరాబాద్ డ్యూటీ ముగించుకుని కరీంనగర్ లో తన బస్సును మరో డ్రైవర్ కు అప్పగించారన్నారు. మద్యాహ్నం 1.30 గంటల ప్రాంతలో బస్సు అప్పగించిన తరువాత 30 నిమిషాల పాటు ఆర్టీసీ స్టాఫ్ రెస్ట్ రూంలో సెదతీరి అక్కడి నుండి జగిత్యాలకు చేరుకున్నాడని, అక్కడి నుండి మద్యాహ్నం సమయంలో ఆర్టీసీ బస్సులోనే బయలుదేరి మార్గమధ్యలోని గుండాయిపల్లిలో తన స్నేహితున్ని కలిసి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడని వివరించారు. అయితే అదే రోజున తన భర్త శేఖర్ మద్యాహ్నం 4.30 గంటల సమయంలో సాక అశోక్ ఇంట్లోకి చొరబడి బెదిరించి రూ. 2 వేలు దొంగతన చేశాడని కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గతంలో బెదిరింపులకు గురి చేస్తే మూడేళ్ల క్రితమే ఇళ్లు ఖాలీ చేసి వెల్లిపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. అయితే ఫిర్యాదు దారుడు ఇళ్లు ఖాలీ చేసి వెల్లిపోయిన తరువాత ఎవరూ లేని ఇంట్లోకి తామెలా చొరబడి చోరీ చేస్తామో అర్థం కావడం లేదన్నారు. జులై 29న వచ్చిన నేరం జరిగినట్టుగా పిటిషన్ అందుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేయకుండానే నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. జులై 29న తన భర్తకు సంబంధించిన కదలికల గురించి టవర్ లోకేషన్ తో పాటు సీసీ ఫుటేజీలను కూడా పరిశీలించాలని కవిత అభ్యర్థించారు. సాక శేఖర్ ను అరెస్ట్ చేసిన ఆగస్టు 3వ తేదిన కూడా పోలీసులు ఇంటికి వచ్చి దుర్భాషలాడుతూ… కొడుతూ తీసుకెళ్లారని, అనంతరం నేరుగా స్టేషన్ కు తరలించకుండా పోలీసులు తీసుకొచ్చిన వాహనంలోనే బేడీలు వేసి పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో తిప్పారన్నారు. ఓ పెట్రోల్ బంకులో కూడా కావాలనే ఉంచి సాయంత్రం వరకు స్టేషన్ కు తరలించలేదన్నారు. అంతేకాకుండా ఆగస్టు 3వ తేది ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సాక శేఖర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అదే రోజు సాయంత్రం స్టేషన్ కు పిలిపించి అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం ఇస్తున్నామని చెప్పి రిజిస్టర్ లో సంతకాలు చేయించుకున్నారన్నారు. ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న శేఖర్ కు ఉద్యోగరిత్యా ఇబ్బందులు తలెత్తాలన్న ఉద్దేశ్యంతోనే ఎస్సై ఉదయ్ కుమార్ వ్యవహరించారని కవిత ఆరోపించారు. అంతకు ముందు తన కూతురు అత్తింటి వేధింపులకు గురవుతున్న విషయంలో కూడా ఇదే ఎస్సైకి ఫిర్యాదు చేస్తే బాధితుల పక్షాణ కాకుండా నిందితుల పక్షాన నిలిచి తమనే ఇబ్బందులకు గురి చేశాడని, దీంతో స్థానిక సీఐకి విన్నవించుకోవడంతో ఎఫ్ఐఆర్ జారీ చేశారన్నారు. అయితే వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన ఎస్సై పేరిట ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి రూ. లక్షా 50 వేలు ఇస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారని అయితే బాధితులమైన తాము ఇవ్వలేమని చెప్పడంతో తన కూతురు అత్తింటి వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని దీంతో మా కూతురు భర్త విదేశాలకు వెల్లిపోయాడన్నారు. ఈ విషయం తెలిసి మాకు అన్యాయం చేశారని ఎస్సైని కలిసి ఆవేదన వ్యక్తం చేశామని వివరించారు. ఇది మనసులో పెట్టుకున్న ఎస్సై అయితే తమ ఇంటి విషయంలో ఉన్న వివాదం తెలుసుకుని తప్పుడు ఫిర్యాదు తీసుకుని తన భర్తను కావాలనే కేసులో ఇరికించారన్నారు. అస్తమా పేషెంట్ అయిన తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన వ్యవహరించిన ఎస్సై ఉదయ్ తీరుపై విచారణ జరిపి తన భర్తపై పెట్టిన తప్పుడు కేసు విషయంలో కూడా దర్యాప్తు చేయాలని ఆ ఫిర్యాదులో అభ్యర్థించారు.