వైరల్ అవుతున్న వీడియో…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఫై ఓవర్ బ్రిడ్జి పక్కన సెద తీరుతూ గాండ్రిస్తోంది ఓ పెద్దపులి… బైక్ పై వస్తున్న ఇద్దరు పులి సమీపంలోకి చేరుకున్న తరువాత గమనించి వెనుదిరిగి వెల్లిపోయారు. మరో వైపున ఓ కారు, బస్సు పులి ఎదురుగుండా వెల్లిపోతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు కరీంనగర్ వాసుల వాట్సప్ లలో తిరుగుతోంది. గురువారం రాత్రి నుండి వైరల్ అవుతున్న ఈ వీడియో కరీంనగర్ బైపాస్ రోడ్డులో అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులో కూడా ఫ్లై ఓవర్ ఉండడంతో స్థానికులు నిజంగానే పెద్దపులి వచ్చిందని నమ్మారు. ఉన్నట్టుండి ఈ పెద్దపులి కరీంనగర్ బైపాస్ రోడ్డుపైకి ఎలా వచ్చిందన్నదే అంతుచిక్కకుండా పోయింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కరీంనగర్ సమీపంలోని రామగుండం బైపాస్ రోడ్డులో పెద్దపులి రావడం ఏంటన్న విషయాన్ని విస్మరించారు. నిజంగానే పెద్దపులి వచ్చి ఉంటుందని భావించిన చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేసేశారు. ఇటీవల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లో పెద్ద పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపులి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి కరీంనగర్ బైపాస్ రోడ్డులో అని కొటేషన్ ఇచ్చి మరీ వైరల్ చేసేశారు. దీంతో నిజమై ఉంటుందని చాలా మంది నమ్మేశారు.
వాస్తవం ఏంటంటే..?
2023 ఏప్రిల్ లో కర్ణాటక రాష్ట్రంలోని గడాక్ జిల్లా బింకడకట్టి ఫ్లైఓవర్ వద్ద పెద్దపులి సంచారిస్తుందని చెప్పి ఇదే వీడియోను 2023లో వైరల్ చేశారు. అయితే బింకడకట్టి వద్ద పెద్దపులి తిరిగింది కూడా వాస్తవమేనని అంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎవరూ దృవీకరించలేదు. అయితే కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇలాగే ఉండడం, ఇక్కడ ఫుట్ పాత్ కూడా ఉండడంతో స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు అకతాయిలు. నిజానికి పెద్దపులి కరీంనగర్ బైపాస్ రోడ్డుకు కాదు కదా జిల్లా పొలిమేరల్లోకి కూడా రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో రెండు వైపుల వాహనాలు ఒకే రహదారిపై వెల్తున్నాయి. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఫై ఓవర్ వద్ద బ్రిడ్జికి ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి కానీ ఒకే రోడ్డుపై ఎదురెదురుగా వాహానాలు వచ్చివెల్లే అవకాశం లేదు.
ఇదే నిజమైతే…
కరీంనగర్ సిటీతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలుగు బంట్లు, చిరుత పులులు సంచరించిన దాఖలాలు ఉన్నాయి. వన్యప్రాణులను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకుని పార్కులకు, అటవీ ప్రాంతాలకు తరలించిన సందర్భాలూ ఉన్నాయి. ఏకంగా పెద్దపులే కరీంనగర్ శివార్లలోకి చేరుకున్నట్టయితే అధికార యంత్రాంగం ఎంతమేర అప్రమత్తంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పెద్దపులి వచ్చి వెల్లిన విషయం వెలుగులోకి వచ్చిన దాని అడుగు జాడల ఆధారంగా అది ఎక్కడి నుండి వచ్చింది..? ఎటు వైపు వెల్లింది అన్న వివరాలు తెలుసుకుని అటవీ అధికారులు ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేసేవారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ హై అలెర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితులు ఉండేవి. పులి తిరిగి అటవీ ప్రాంతంలోకి చేరే వరకు కూడా జాగ్రత్తలు తీసుకునే వారు.