దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్ లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో టీమ్ కు డీఎస్పీలను ఇంచార్జీలుగా నియమించినట్టు సమాచారం. ఈ విచారణ బృందాలు హైదరాబాద్ లోని కాళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంతో పాటు వరంగల్, రామగుండం, మహదేవపూర్, మేడిగడ్డతో ప్రాజెక్టకుకు సంబంధించిన స్పెషల్ ఆఫీసుల్లో విచారణ చేపట్టాయి. అలాగే కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం క్యాంపులో ఉన్న ఈఎన్సీ వెంకటేశ్వర్లు క్యాంప్ ఆఫీసులో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని జలసౌధలో కూడా స్పెషల్ టీమ్స్ రికార్డులను పరిశీలిస్తున్నాయి. కొద్ది సేపటి క్రితం విజిలెన్స్ అధికారుల బృందాలు కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించడం ఆరంభించాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లో కూడా రికార్డులు పరిశీలిస్తున్నాయి. ఈ బృందాలు ఆయా కార్యాలయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఇందుకు సంబంధించిన వివరాలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల భాగస్వామ్యంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే టెక్నికల్ అంశాలకు సంబధించిన విషయాలపై సమగ్రంగా తెలుసుకున్న తరువాత డిటైల్డ్ రిపోర్టును విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం. లింక్ 1 వన్ కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్మాణ ప్రాంతాల్లో కూడా క్షేత్ర స్థాయి పరిశీలన కూడా జరపనున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఆయా పనులకు సంబంధించిన ఎస్టిమేట్ల వివరాలు, రివైజ్డ్ చేసిన వివరాలు, ఎంబీ రికార్డులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయనున్నారు. నిర్మాణం కోసం ఉపయోగించే కాంక్రీట్ తో పాటు ఇతర సామాగ్రి ఏ మోతాదులో వాడాలని అంచానలు తయారు చేశారు వాస్తవంగా వినియోగించిన మెటిరియల్ సైజ్ ఏంటీ అన్న విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాంక్రీట్ నిర్మాణ సమయంలో క్యూరింగ్ కోస ఉపయోగించిన విధానం, పిల్లర్లు వేసే ప్రాంతాల్లో చేపట్టిన పరీక్షలు ఇందుకు అనుగుణంగా నిపుణులు చేసిన ప్రతిపాదనలు ఏంటీ అందుకు అనుగుణంగానే వ్యవహరించారా లేదా అన్న విషయంపై విచారించనున్నట్టు సమాచారం. ప్రధానంగా బ్యారేజీల కోసం ఎంపిక చేసిన సైట్స్ ఎంపిక ఎలా చేశారు అన్న వివరాలు కూడా తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద ఎంత మేర ఉంది..? అందుకు తగిన విధంగా బ్యారేజీల నిర్మాణానికి కాంక్రీట్ వినియోగించారా లేదా..? ఇందు కోసం నిపుణులను సంప్రదించారా లేదా అని ఆరా తీయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే పంప్ హౌజ్ లను నిర్మించేప్పుడు ఫ్లడ్ అంచనాలు వేసిన తీరు, అవి వరద నీటిలో ముంపునకు గురి కావడానికి కారణాలు ఏంటన్న వివరాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరంలో శాస్త్రీయంగా నిర్మాణాలు జరిపేందుకు ఇంజనీర్లు చేపట్టిన చర్యలన్నింటిని ఆధారాలతో సహా తీసుకుని నిపుణులతో చర్చలు జరిపి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నట్టు సమాచారం.
dishadasha
1232 posts
Prev Post