వరంగల్, జగిత్యాల జాతీయ రహదారి కోసం చేపట్టిన భూ సేకరణ పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. నిభందనలకు విరుద్దంగా భూ సేకరణ ఒక వైపునే జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వద్ద భూ సేకరణ జరుపుతున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపేందుకు రాగా వారిని రైతులు అడ్డుకున్నారు అధికారులు ఇష్టానుసారంగా భూసేకరణ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం మొదట ఇచ్చిన మ్యాప్ లో చూపించిన విధంగా కాకుండా ఇప్పుడు ఒక పక్కనే భూ సేకరణ జరపడం సరికాదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ రహదారి కోసం చేపట్టిన భూ సేకరణకు సంబందించిన వ్యవహారంలో నాలుగుసార్లు మార్పులు, చేర్పులు చేశారని వారు ఆరోపిస్తున్నారు. రోడ్డు కోసం ఒక పక్క భూ సేకరణ జరపడం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లనుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బైపాస్ రోడ్డు కోసం భూ సేకరణ జరపడాన్ని నిలిపేయాలని, ప్రధాన రహదారి మీదుగానే భూ సేకరణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఒక పక్కనే రోడ్డు కోసం భూ సేకరణ జరపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కొంతమంది రైతులైతే ఉన్న భూమిని కోల్పోయే ప్రమాదం ఉందని వెదిర రైతులు వివరించారు. అలాగే తమ భూములకు ఇచ్చే పరిహారం గురించి ముందుగా ప్రకటించిన తరువాతే సర్వే జరపాలని స్పష్టం చేశారు. దీంతో రైతుల అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లిపోయారు.