దిశ దశ, కాళేశ్వరం:
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదన్నట్టుగా ఉంది ఆ గ్రామాల ప్రజల పరిస్థితి. సర్కారు ఆదాయం ఏమో కానీ అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. గతంలో వర్షాకాలంలో మాత్రమే జలదిగ్భంధనంలో చిక్కుకునే ఆ పల్లెలు నేడు లారీల దిగ్భంధనంలో చిక్కుకపోయాయి. దీంతో ఆ రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడి ప్రజలు
ఇసుక రీచుల ఎఫెక్ట్…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పరిసర గ్రామాల ప్రజలు ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం, పల్గుల రహదారి మొత్తం కూడా లారీలతో కిక్కిరిసిపోతోంది. పూస్కుపల్లి నుండి పల్గుల వరకు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రీచుల నుండి ఇసుక రవాణా చేసేందుకు పెద్ద సంఖ్యలో లారీలు వస్తున్నాయి. వందల సంఖ్యలో వస్తున్న లారీలతో రహదారి మొత్తం కిటకిటలాడిపోతోంది. దీంతో పల్గుల, మద్దులపల్లి, నాగెపల్లి, పూస్కుపల్లి తదితర గ్రామాల ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రోడ్లకు ఇరువైపులా లారీలను పార్క్ చేస్తుడడంతో పాటు మధ్య నుండి ఇతర లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యవసర పనులు ఉన్నప్పుడు బయటకు వచ్చిన వారు ఈ లారీల నడుమ చిక్కుకపోయి సకాలంలో గమ్యం చేరుకోలేకపోతున్నారు. అనారోగ్యం బారిన పడిన వారు చికిత్స కోసం మండల కేంద్రానికి వెల్లడానికి కూడా నరకం అనుభవిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే వాహనాలు కూడా ఈ లారీల కారణంగా ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. దీంతో విద్యార్థులు 100కు డయల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఇక్కడ ఇసుక లారీల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వీటి కారణంగా బైకులపై ప్రయాణించే వీలు కూడా లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్గుల సమీపంలోని గోదావరి నది మీదుగా చెన్నూరు ప్రాంతానికి చెందిన వారు కూడా రాకపోకలు సాగించే వారు. అయితే ఇసుక లారీల కారణంగా 10 నుండి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వారు మహారాష్ట్రలోని సిరొంచ మీదుగా 50 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే్కాకుండా దేశంలోనే అత్యంత అరుదైన క్షేత్రంగా భాసిల్లుతున్న కాళేశ్వరానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పార్కింగ్ స్థలాలు ఏవీ..?
భారీ ఎత్తున తరలిస్తున్న ఇసుక రీచుల వద్ద లారీలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. ప్రధాన రహదారులపై వాహనాలను పార్క్ చేయరాదన్న విషయాన్ని పట్టించుకోని టీఎస్ఎండీసీ రీచుల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టడం లేదు. ప్రతి రీచు వద్దకు వచ్చే లారీల సంఖ్యను బట్టి అక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల కోసం భూమిని లీజుకు తీసుకున్నట్టయితే లారీల సమస్యకు శాశ్వత పరిష్కరం దొరుకుతుంది. కానీ ఈ సారి టీఎస్ఎండీసీ అధికారులు మాత్రం ఆ దిశగా చొరవ చూపకపోవడంతో రీచుల పరిసర ప్రాంతాల్లోని జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఊహించని రీతిలో లారీలు వస్తున్నందున చిన్న రహదారి కావడంతో రోజూ సమస్యలు ఎదుర్కొంటున్నారు స్థానికులు.
గతంలో అలా…
గతంలో ఇసుక రీచుల నుండి వెల్లే లారీలకు సమయపాలన విదించారు. స్థానిక పోలీసులు ఈ విషయంపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టి స్కూల్ హవర్స్ లో లారీల రాకపోకలను నియంత్రించేవారు. నియంత్రించే వారు. ఉధయం 8 గంటల నుండి గంటకు పైగా, సాయంత్రం నాలుగు గంటల నుండి దాదాపు రెండు గంటల పాటు ఇసుక లారీలను నిలిపివేసేవారు. దీంతో స్కుళ్లకు వెల్లేందుకు, ఇంటికి చేరేందుకు విద్యార్థులకు సులువుగా ఉండేది. కానీ ఈ సారి లారీలు ఇష్టారీతిన రాకపోకలు సాగిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంబూలెన్స్ వంటి వాహనాలకు కూడా దారి ఇచ్చే అవకాశం లేకుండా రోడ్డంతా లారీలే ఆక్రమిస్తుండడం సమస్యగా మారిపోయింది. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయించే విషయంతో పాటు పాఠశాలలకు వెల్లి, తిరిగి ఇంటికి చేరుకునే సమయాల్లో ఇసుక లారీలను కట్టడి చేస్తే విద్యార్థులు కూడా క్షేమంగా గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది.