దిశ దశ, ఆదిలాబాద్:
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన అంగన్ వాడీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. నెలకు రూ. 25 వేల వేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీలు బుధవారం కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అంగన్ వాడీల నిరసనలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కలెక్టరేట్ ముందు నిరసన చెప్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు రోప్ పార్టీని దాటి కలెక్టరేట్ లోపలకు చొరబడుతున్న క్రమంలో వెనక ఉన్న ఓ మహిళా ఎస్సై ఆమెను వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సై వెనక వైపున ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలు తోటీ మహిళ అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టి మరీ వెనక్కి లాక్కెళ్లారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.