VNRకు లైన్ క్లియర్… ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయనేనా?

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకత్వం సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇంతకాలం ప్రచార పర్వానికే పరిమితం అయిన ఆయన పార్టీ నాయకులను కలుస్తుండడం ఇందుకు బలాన్నిఐఐ చేకూరుస్తోంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా వి నరేందర్ రెడ్డి పేరును చాలా మంది ప్రతిపాదించారన్నారు. అప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన పేరు ప్రతిపాదిస్తూ ఢిల్లీ పెద్దలకు పంపించారు. అయితే తాజాగా మారిన పరిణామాలను గమనిస్తే వి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్టుగా అర్థం అవుతోంది. ఆయన కూడా ఏఐసీసీ బాధ్యులను కలవడం, స్థానికంగా ఎమ్మెల్యేలను కలుస్తుండడం గమనార్హం. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. ఇప్పటి వరకూ పీసీసీ, ఏఐసీసీ నేతలను, సీఎం రేవంత్ రెడ్డిని అడపాదడపా కలుస్తూ ప్రచారం చేయడానికే పరిమితం అయిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండడం విశేషం.

సారీ జీవన్ ?

సిట్టింగ్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ వద్దని సన్నిహితులతో చెప్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ప్రత్యమ్నాయంగా నరేందర్ రెడ్డి అయితే బావుంటుందని అధిష్టానం భావిస్తున్నట్టుగా ఉంది. తాజాగా పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలో జీవన్ రెడ్డి కుటుంబానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలలకు పదవులు కట్టబెట్టింది. అయితే జీవన్ రెడ్డి తనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ప్రతిపాదనపై అధిష్టానం ఎలా స్పందిస్తో అన్నది తేలాల్సి ఉంది.

You cannot copy content of this page