దిశ దశ, జోగులాంబ గద్వాల:
క్షేమంగా గమ్యం చేరుతామన్న ధీమాతో గాఢ నిద్రలోకి జారుకున్న వారిని విధి వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్లే… హైదరాబాద్ నుండి అర్థరాత్రి చిత్తూరుకు అమెజాన్ జగన్ వోల్వో బస్సు బయలుదేరింది. సుమారు 30 మంది వరకు ప్రయాణీకులు ఉన్న ఈ బస్సు బీచుపల్లి కృష్ణ నది సమీపంలోని ఇటిక్యాల పదో బెటాలియన్ వద్ద బోల్తా పడింది. నిద్రలోకి జారుకున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలతో బయటపడితే చాలని బస్సులోంచి బయటకు దూకే ప్రయత్నం చేశారు. అంతలోనే బస్సులో మంటలు చెలరేగడంతో ఓ మహిళా ప్రయాణీకురాలు సజీవ దహనం అయ్యారు. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ప్రయాణీకులు భీతిల్లిపోయారు. ఇదే సమయంలో ఇన్నోవాలో వెల్తున్న ప్రయాణీకులు, నేషనల్ హైవే అథారిటీ యంత్రాంగం బోల్తా పడిన బస్సు నుండి ప్రయాణీకులను రక్షించారు. లేనట్టయితే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ప్రమాదం నుండి బయటపడ్డ ప్రయాణీకులు గజగజ వణికిపోతున్నారని, తీవ్ర భయంలో కొట్టుమిట్టడుతున్నారని ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. అటుగా వెల్తున్న మూడు బస్సులను ఆపినా ఆగలేదని చివరకు కర్నూలు వెల్తున్న బస్సు ఆగడంతో వారందరిని కర్నూలుకు తరలించామన్నారు. వారివద్ద డబ్బులు కూడా లేకపోవడంతో ఇన్నోవా ప్రయాణీకులు సాయం అందించారు. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణీకులకు గాయాలు అయినట్టు తెలిపారు.
మారిన డ్రైవర్…
అర్థరాత్రి చిత్తూరుకు బయలు దేరిన ఈ వోల్వో బస్సును జడ్చర్ల వరకు ఎసెపు నడపి రెస్ట్ లో ఉన్న డ్రైవర్ శంషోద్దీన్ కు అప్పగించి నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటి తరువాత నిద్రలోంచి లేచి చూసే సరికి బస్సు బోల్తా పడిన విషయాన్ని గమనించాడు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటన్న విషయం తెలియరావడం లేదు. డ్రైవర్ అజాగ్రత కారణంగా బస్సు అదుపు తప్పిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది.