బంజారా బిడ్డల మధ్య వార్…

కారులో విబేధాల జోరు

ఆ జిల్లా అంతా బంజారా బిడ్డలదే ఆధిపత్యం. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నది కూడా వారే. ఒకే జాతి నుండి నాయకులుగా ఎదిగి ఒకే పార్టీలో కొనసాగుతున్న వారు మాత్రం ఏకతాటిపై నడవడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా రాజకీయాలు నెరుపుతున్నారు. విధాన సభ, పరిషత్తు, లోకసభ ఇలా మూడు చట్ట సభలకూ బంజారా నేతలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ వారిలో మాత్రం నిరంతరం వర్గ విబేధాలు పొడసూపుతూనే ఉన్నాయి. దీంతో రానున్న ఎన్నికలపై ప్రభావం పడుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధినాయకత్వం జిల్లాలో నెలకొన్న ఈ విబేధాలకు చికిత్స చేయాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏ జిల్లా ఏ జిల్లా…?

విప్లవాల ఖిల్లా… ఉద్యమాల్లో పిడికిలెత్తిన జిల్లా మానుకోట. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సాక్షిగా ఎంతటి పోరాటం జరిగిందో అందరికీ తెలిసిందే. అంతటి చైతన్యాన్ని అందించిన మానుకోట బీఆర్ఎస్ పార్టీకి గ్రూపుల కారణంగా బీటలు వారుతున్నాయి. ఒకే గిరిజన జాతికి చెందిన బిడ్డల పంచాయితీ రచ్చకెక్కుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారి మధ్య నెలకొన్న విబేధాలు అందరి దృష్టిని అటుగా చూపించే పరిస్థితికి చేర్చాయి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష్య ఎన్నికల ద్వారా చట్ట సభలో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఒకరిద్దరిదైతే, తమ బెర్త్ ఖాయం చేసుకోవాలన్న తపన మరికొందరిది, వారసులకు ఎంట్రీ ఇవ్వాలని మరోనేత ప్రయత్నాలు ఇలా ఎవరి లక్ష్యాలను వారు నిర్దేశించుకుని గ్రూపులుగా విడిపోయి ముందుకు సాగుతున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది.

ఓపెన్ వార్…

మహబూబాబాద్ జిల్లాలో నెలకొన్న వార్ బహిరంగంగానే సాగుతోంది. జిల్లా కేంద్రం సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదని ఇటీవల కాలంలో జరిగిన బహిరంగ సభల్లో వీరిద్దరూ వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరి క్యాంపు ఆఫీసులకు వారు పరిమితం అవుతున్నారు. సొంత ప్రభుత్వానికి సంబందించిన సంబరాలే అయినా ప్రతిపక్ష పార్టీలపై విమర్శానాస్త్రాలు సంధించడమే అయినా వేర్వేరుగానే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. మానుకోట జిల్లా అద్యక్షురాలిగా స్థానిక ఎంపీ మాలోతు కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో విబేధాలు పొడసూపడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తన తనయుడి రవిచంద్రకు టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అదే సీటుపై మరో ఇద్దరు మహిళా నాయకురాలి దృష్టి పడినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపున శంకర్ నాయక్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ఆశీస్సులు అందిస్తున్నారని ప్రత్యర్థి వర్గం కినుక వహిస్తోంది. అలాగే ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ టికెట్ ఆశిస్తున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మానుకోటలో నిర్వహించిన వేదికపై మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ప్రసంగిస్తున్న క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో కూడా తనకే ప్రాధాన్యత ఇచ్చారని, సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని సీఎం ప్రకటించారని శంకర్ నాయక్ వర్గం బలమైన వాదనలు వినిపిస్తోంది.

చెక్ పెట్టాల్సిందే…

గులాభి పార్టీలో నాయకుల మధ్య వార్ తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో నాయకత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత అయితే ఉందని జిల్లా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో పార్టీ ఉనికే లేకుండా పోగా బీజేపీ పరిస్థితి అంతంతగానే ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఏది ఏమైనా ప్రతి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకు ఉన్నదన్న విషయం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన వర్గ విబేధాలను గమనించి ఇక్కడి క్యాడర్ ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపితే బీఆర్ఎస్ పార్టీకి మొదటికే మోసం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లీడర్ల మధ్య సయోధ్య లేనట్టయితే క్యాడర్ కూడా అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నది నిజం. లీడర్లలో నెలకొన్న పంచాయితీలకు చెక్ పెట్టేందుకు అధినేత కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉందని ఇక్కడి పరిస్థితులు తేల్చి చెప్తున్నాయి.

You cannot copy content of this page